Tri Series NZ VS PAK: రెచ్చిపోయిన బాబర్‌.. పాక్‌ ఖాతాలో వరుసగా రెండో విక్టరీ 

8 Oct, 2022 15:43 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో దాయాది పాకిస్తాన్‌ వరుస విజయాల బాట పట్టింది. నిన్న (అక్టోబర్‌ 7) బంగ్లాదేశ్‌ను 21 పరుగుల తేడా మట్టికరిపించిన బాబర్‌ సేన.. ఇవాళ ఆతిధ్య న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఇవాల్టి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన పాక్‌ న్యూజిలాండ్‌ను 147 పరుగులకే (20 ఓవర్లలో 147/8) పరిమితం చేసింది. హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లతో కివీస్‌ను దెబ్బకొట్టగా.. మహ్మద్‌ వసీం జూనియర్‌, మహ్మద్‌ నవాజ్‌ తలో రెండు వికెట్లు, షానవాజ్‌ దహాని ఓ వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన డెవాన్‌ కాన్వే టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (31), మార్క్‌ చాప్‌మన్‌ (32) పర్వాలేదనిపించారు.

అనంతరం 148 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (53 బంతుల్లో 79; 11 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో చెలరేగడంతో 18.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ఆఖర్లో హైదర్‌ అలీ 2 బంతుల్లో సిక్స్‌, ఫోర్‌ బాది పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు.

న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ (4 ఓవర్లలో 1/22), టిమ్‌ సౌథీ (4 ఓవర్లలో 1/24) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. టిక్నర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ధసెంచరీతో రాణించిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. టోర్నీలో రేపు (అక్టోబర్‌ 9) జరుగబోయే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి.
 

మరిన్ని వార్తలు