సూర్యకుమార్‌ మంచి ఆటగాడే కానీ.. పాక్‌ ప్లేయర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

8 Oct, 2022 20:34 IST|Sakshi

టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌పై పాకిస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 ప్లేయర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో నిన్న (అక్టోబర్‌ 7) బంగ్లాదేశ్‌ను పాక్‌ మట్టికరిపించిన అనంతరం రిజ్వాన్‌ మీడియాతో మాట్లాడుతూ సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ శైలిని ప్రశంసలతో ముంచెత్తాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ టాప్‌ ర్యాంక్‌ దిశగా వేగంగా అడుగులేయడంపై స్పందిస్తూ.. 

సూర్యకుమార్‌ మంచి ఆటగాడని, అతని ఆటంటే తనకెంతో ఇష్టమని, అతను షాట్లు ఆడే విధానం తనను బాగా ఆకట్టుకుంటుందని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే ఇన్నింగ్స్‌ ఆరంభించడానికి, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడానికి మాత్రం చాలా వ్యత్యాసముంటుందని అభిప్రాయపడ్డాడు. చివరిగా తాను ర్యాంకింగ్స్‌ల గురించి అస్సలు పట్టించుకోనని, జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని గొప్పలు పోయాడు. 

కాగా, ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ 854 రేటింగ్‌ పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ 838 రేటింగ్‌ పాయింట్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రిజ్వాన్‌, సూర్యకుమార్‌ల మధ్య 16 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసమే ఉండటంతో సూర్యకుమార్‌ త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌లో రిజ్వాన్‌ను వెనక్కునెట్టి టాప్‌ ర్యాంక్‌కు చేరడం ఖాయమని భారత అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ జాబితాలో పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ (801) సూర్యకుమార్‌ వెనుక మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌ (606), విరాట్‌ కోహ్లి (605), రోహిత్‌ శర్మ (604) వరుసగా 14, 15, 16 స్థానాల్లో ఉన్నారు. టాప్‌-10లో సూర్యకుమార్‌ మినహా మరే ఇతర భారత ఆటగాడు లేకపోవడం విశేషం. 

మరిన్ని వార్తలు