కెన్యా, జింబాబ్వేతో ఆడాల్సింది; పాక్‌ పరువు తీసిన ఫ్యాన్స్‌

9 Jul, 2021 14:08 IST|Sakshi

కార్డిఫ్‌: క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఆట అనిశ్చితికి మారుపేరు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో గెలవడం.. కచ్చితంగా గెలుస్తామని అనుకున్నవి ఓడిపోవడం ఒక్క పాకిస్తాన్‌ జట్టుకే చెల్లుతుంది. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందే ఇంగ్లండ్‌ జట్టులో నలుగురు ఆటగాళ్లు సహా మొత్తం ఏడు మంది సిబ్బంది కరోనా బారీన పడ్డారు.

దీంతో స్టోక్స్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ అందుబాటులో ఉన్న సెకండ్‌ టీమ్‌ను ఈ సిరీస్ కోసం ఈసీబీ అప్పటికప్పుడు ఎంపిక చేసింది. దీంతో ఈ సిరీస్‌లో పాకిస్థానే హాట్ ఫేవ‌రెట్ అని అంతా భావించారు. కానీ తొలి వ‌న్డేలోనే ఆ టీమ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. 36 ఓవ‌ర్ల‌లోపే కేవ‌లం 141 ప‌రుగుల‌కే పాక్ బ్యాట్స్‌మెన్ చాప చుట్టేశారు. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ వికెట్ మాత్రమే కోల్పోయి 21.5 ఓవ‌ర్లలోనే చేధించింది.

ఈ మ్యాచ్‌తోనే ఇంగ్లండ్ టీమ్‌లో ఏకంగా ఐదుగురు వ‌న్డేల్లో అరంగేట్రం చేయ‌డం విశేషం. బెన్ స్టోక్స్ సిరీస్ కోసం స్టాండిన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాంటి టీమ్ పూర్తి బ‌లగంతో ఉన్న పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయిన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పాక్ టీమ్ ప‌రువు తీశారు. '' కెన్యాతోనో, జింబాబ్వేతోనో సిరీస్ పెట్టుకోండని ఒక‌రు..  ఫుల్ టీమ్‌తో ఉన్న ఇంగ్లండ్ టీమ్‌పై శ్రీలంక ఇంత‌కన్నా బాగా ఆడింద‌ని'' మ‌రొక‌రు ట్విట‌ర్‌లో కామెంట్ చేశారు.

మరిన్ని వార్తలు