ఎవరి పతకం వారే...

15 Jul, 2021 05:08 IST|Sakshi

విజేతలే తమ మెడలో వేసుకోవాలి

కరోనాతో టోక్యో ఒలింపిక్స్‌లో మారనున్న ఆనవాయితీ  

టోక్యో: కరోనా కాలంలో పాత కాలం నాటి నిబంధనలుండవ్‌! మారతాయి లేదంటే మహమ్మారి మార్చేస్తుంది. సరిగ్గా అలాంటిదే టోక్యో ఒలింపిక్స్‌లో జరుగనుంది. పతకాల ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా, అతిరథుల చేతుల మీదుగా జరగదు. ఫీల్డులో గెలిచిన వారే పోడియంపైకి వచ్చి  వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరి పతకాన్ని వారే ఓ ఆభరణంగా ధరిస్తారు అంతే! వైరస్‌ సంక్రమణాన్ని నిరోధించడంలో భాగంగా పతకాల తంతును అలా ముగించనున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. ఒక ప్లేట్‌లో పతకాలు పోడియం దగ్గరకు తీసుకొస్తారు. ఎవరేం గెలిచారో (స్వర్ణ, రజత, కాంస్యం) వాళ్లే స్వీయ పతకధారణ చేసుకోవాలి. ఇంకా వేదిక వద్దగానీ, పోటీల దగ్గర కానీ కరచాలనం, భుజం తట్టి ప్రోత్సహించడం (వెల్‌డన్‌)లాంటివి ఈ క్రీడల్లో నిషిద్ధం.  

కలకలం రేపుతున్న కేసులు...
అంతా బాగుందిలే... ఇక వేడుకలే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో బుధవారం నాటి కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క టోక్యోలోనే 1,149 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. గత ఆరు నెలల కాలంలో ఇదే అత్యధికమని టోక్యో మెట్రోపాలిటన్‌ గవర్నమెంట్‌ ప్రకటించింది. ఒలింపిక్స్‌ సమీపిస్తున్న వేళ కోవిడ్‌ కేసుల పెరుగుదల జపాన్‌ ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), గేమ్స్‌ నిర్వాహక కమిటీలను కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. టోక్యోలో జనవరి 22న 1,184 మంది కోవిడ్‌ బారిన పడగా ఆ తర్వాత ఎప్పుడూ ఆ స్థాయికి రానేలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ఐఓసీ, జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.  

రాజా వారి చేతుల మీదుగా...
టోక్యో విశ్వక్రీడలను జపాన్‌ రాజు ప్రారంభిస్తారని గేమ్స్‌ నిర్వాహక కమిటీ వర్గాలు తెలిపాయి. జపాన్‌ చక్రవర్తి నరుహితో 23న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలు ఆరంభమయినట్లు అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. 61 ఏళ్ల రాజు నరుహితో టోక్యో ఒలింపిక్స్‌కు ప్యాట్రన్‌గా ఉన్నారు. వేడుకల్లో భాగంగా ఇంపీరియల్‌ ప్యాలెస్‌లో విదేశీ వీఐపీలతో భేటీ అవుతారని అక్కడి వర్గాలు తెలిపాయి. గతంలో జపాన్‌ ఆతిథ్యమిచ్చిన మెగా ఈవెంట్‌లను ఈ రాజు కుటుంబీకులే ఆరంభించారు. 1998 వింటర్‌ ఒలింపిక్స్‌ను ఆయన తండ్రి అకిహితో ప్రారంభించగా, 1964 సమ్మర్‌ ఒలింపిక్స్, 1972 వింటర్‌ ఒలింపిక్స్‌లను  తాత... హిరోహితో రాజదర్పంతో ఆరంభించారు.

చైనా జంబో సేన...
బీజింగ్‌: విశ్వ క్రీడలకు చైనా జంబో సేన బయల్దేరనుంది. 431 మంది క్రీడాకారులతో సహా 777 మందితో కూడా చైనా బృందం టోక్యోలో అడుగుపెట్టనుంది. ఇందులో 133 మంది పురుష అథ్లెట్లు అయితే రెట్టింపునకు మించి 298 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. 14 ఏళ్ల డైవింగ్‌ క్రీడాకారిణి క్వాన్‌ హాంగ్‌చన్‌ నుంచి 52 ఏళ్ల ఈక్వెస్ట్రియన్‌ రైడర్‌ లి జెన్‌కియాంగ్‌ వరకు చైనా జట్టులో  ఉన్నారు. చైనా వెలుపల జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అతిపెద్ద చైనా బృందం ఇదే! బీజింగ్‌(2008)లో 639 మంది అథ్లెట్లు సహా 1099 మంది పాల్గొన్నారు.

చీర్‌4ఇండియా...
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందాన్ని ఉత్సాహపరిచే పాటను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం విడుదల చేశాడు. ‘చీర్‌4ఇండియా’ పేరుతో ఈ పాట భారతీయ శ్రోతలను అలరించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ ఈ ప్రత్యేక పాటకు సంగీతం అందించగా... యువ గాయని అనన్య బిర్లా ఆలపించారు. అధికారిక పాట విడుదల సందర్భంగా మంత్రి ఠాకూర్‌ మాట్లాడుతూ అందరూ ఈ పాటను వినాలని, తమ వారికి షేర్‌ చేయాలని అలా యావత్‌ భారత్‌ ఈ పాట ద్వారా తమ వాణి వినిపించాలని, భారత బృందానికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా నేపథ్యంలో భారత క్రీడాకారుల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, అధిగమించిన తీరు ప్రతిబింబించే విధంగా ఈ పాట ఉందని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) చీఫ్‌ నరీందర్‌ బాత్రా చెప్పారు.  

ముగ్గురు కాదు ఆరుగురితో ప్రతిజ్ఞ...
ఆనవాయితీగా వేడుకల ప్రారంభోత్సవంలో ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను రెట్టింపు చేశారు. సాధారణంగా ముగ్గురితో జరిపే ఈ లాంఛనాన్ని ఈసారి ఆరుగురితో  నిర్వహిస్తారు. లింగ సమానత్వంలో భాగంగా ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను పెంచినట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తెలిపింది. అంటే ముగ్గురు చొప్పున మహిళలు, పురుషులు ప్రతిజ్ఞలో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు