ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్‌ ఇదేనా ?

1 Nov, 2020 16:10 IST|Sakshi
టాస్‌ సమయంలో రాహుల్‌-ధోని(ఫోటో సోర్స్‌; బీసీసీఐ/ ఐపీఎల్‌)

అబుదాబి: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఇది తన చివరి ఐపీఎల్‌ కాదనే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. ఈ ఐపీఎల్‌ తర్వాత ధోని ఇక ఆడడని రూమర్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో దానిపై ధోని నుంచి స్పష్టత వచ్చింది. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో భాగంగా టాస్‌ వేయడానికి ధోని వచ్చిన సమయంలో దీనిపై క్లారిటీ వచ్చింది. టాస్‌ వేసిన తర్వాత న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డానీ మోరిసన్‌ నుంచి ఒక ప్రశ్న దూసుకొచ్చింది. ‘ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్‌ ఇదేనా?’ అంటూ అడిగాడు. దానికి అంతే వేగంగా ధోని బదులిచ్చాడు. ‘కచ్చితంగా కాదు’ అంటూ ధోని సమాధానమిచ్చాడు. దాంతో వరుసగా పుట్టుకొస్తున్న రూమర్లకు బ్రేక్‌ పడింది. వచ్చే ఐపీఎల్‌ కూడా తాను ఆడతాననే సంకేతాలిచ్చాడు ధోని.

ఈ సీజన్‌లో లీగ్‌ దశ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి. దాంతో ధోనిపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనికి ధోని ఇచ్చిన సమాధానంతో ముగింపు పడింది.  అంతే కాకుండా ట్వీటర్‌లో ధోని సమాధానానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోని రిప్లై అదిరిందని సీఎస్‌కే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో  టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్‌ కింగ్స్‌ పంజాబ్‌కు కీలకం. రాహుల్‌ గ్యాంగ్‌ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఈ సీజన్‌లో ఇరుజట్లకు లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌.

మరిన్ని వార్తలు