నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌

12 Sep, 2022 19:41 IST|Sakshi

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్‌) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును కొద్ది సేపటి కిందట ప్రకటించారు. ఈ జట్టులో ఎలాంటి సంచలన ఎంపికలకు తావివ్వని సెలెక్టర్లు.. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో పాల్గొన్న జట్టునే యధాతథంగా కొనసాగించారు.  గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు జట్టులోకి తిరిగి రాగా, గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులో కొనసాగనున్నాడు. ఈ మార్పులు మినహాంచి అందరూ ఊహించినట్లుగా జట్టు ఎంపిక జరిగింది. 

కాగా, ప్రపంచకప్‌ జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో అతని అభిమానులు సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌కు మరోసారి మొండిచెయ్యి చూపడంతో భారత సెలెక్టర్లు, జట్టు కెప్టెన్‌, కోచ్‌లపై దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వేమి చేశావు నేరం.. నీ విషయంలోనే ఎందుకిలా అంటూ బాధను వ్యక్తపరుస్తున్నారు. టాలెంట్‌ ఉండి.. టీ20లకు సరిపడే దూకుడు కలిగి.. పోటీదారుల (పంత్‌, డీకేలను ఉద్దేశిస్తూ) కంటే మెరుగైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉండి ప్రతిసారి ఇలా మొండిచెయ్యి చూపడం ఏంటని పెదవి విరుస్తున్నారు. 

శాంసన్‌ను మరోసారి జట్టుకు ఎంపిక చేయకపోవడంతో రకరకాల మీమ్స్‌తో ట్విటర్‌ వేదికగా అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. వికెట్‌కీపర్‌ కోటాలో జట్టుకు ఎంపికైన పంత్‌, డీకేలతో పోలిస్తే శాంసన్‌ ఎందులో తక్కువని ప్రశ్నిస్తున్నారు. శాంసన్‌ను కనీసం స్టాండ్‌ బై వికెట్‌ కీపర్‌గా కూడా ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. సెలెక్టర్లు, కెప్టెన్‌, కోచ్‌లు శాంసన్‌ విషయంలో డ్రామాలాడుతున్నారని, తమ వాళ్ల కోసం​ శాంసన్‌ కెరీర్‌ను నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. 

ఫిట్‌నెస్‌, టెక్నిక్‌, షాట్‌ సెలెక్షన్‌, హిట్టింగ్‌ సామర్ధ్యంలో పంత్‌, డీకేలతో పోలిస్తే శాంసన్‌ మెరుగ్గా ఉన్నప్పటికీ అతన్ని జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని వాపోతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించి రన్నరప్‌గా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ రెగ్యులర్‌ వికెట్‌కీపర్లు కాగా.. వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాకప్‌ అప్షన్‌గా ఉన్నాడు. 

మరిన్ని వార్తలు