Steve Smith: 'ఇన్నేళ్ల నీ అనుభవం ఇదేనా స్మిత్‌.. సిగ్గుచేటు'

12 Jul, 2022 16:43 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్‌ 39 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  లంక రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండో ఇన్నింగ్స్‌లో తాను చేసిన ఒక పొరపాటు అతని మెడకు చుట్టుకునేలా చేసింది. ఔట్‌ అని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి అనవరసంగా రివ్యూకు పోయి చేతులు కాల్చుకోవడమే కాదు క్రికెట్‌ ఫ్యాన్స్‌ విమర్శలను సైతం అందుకున్నాడు.

విషయంలోకి వెళితే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు చూపించాలనుకున్నాడు. కానీ స్మిత్‌ రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రభాత్‌ జయసూర్య వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఐదో బంతి నేరుగా స్మిత్‌ ప్యాడ్లను తాకింది. లంక జట్టు అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ ఔటిచ్చాడు. బంతి కేవలం ప్యాడ్లను మాత్రమే తాకి లెగ్‌స్టంప్‌ను ఎగురగొడతున్నట్లు క్లియర్‌గా తెలిసిపోయింది. దీనికి తోడూ బ్యాట్‌కు బంతి తగల్లేదు.


అయినా కూడా స్మిత్‌ రివ్యూకు వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. రిప్లేలో అతను క్లియర్‌ ఔట్‌ అని తేలింది. అంతే స్మిత్‌ రివ్యూపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ''క్లియర్‌ ఔట్‌ అని తెలిసినప్పటికి రివ్యూ కోరి చేతులు కాల్చుకున్నాడు.. క్రికెట్‌ చరిత్రలో స్మిత్‌ తీసుకున్న రివ్యూ అత్యంత చెత్త నిర్ణయం.. ఇన్నేళ్ల అనుభవం ఇదేనా స్మిత్‌.. సిగ్గుచేటు'' అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలడంతో లంక ఇన్నింగ్స్‌ విజయాన్ని సాధించింది. అంతకముందు చండీమల్‌ డబుల్‌ సెంచరీతో మెరవడంతో లంక 554 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: David Warner:'ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ'

మరిన్ని వార్తలు