గంభీర్‌.. ఇప్పుడేమంటావ్‌?

22 Oct, 2020 16:26 IST|Sakshi

న్యూఢిల్లీ:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల  మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. వన్‌సైడ్‌ వార్‌ అన్నట్లు మ్యాచ్‌ ఆద్యంతం ఆర్సీబీవైపే ఉంది. కానీ మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌పై భారీ అంచనాలున్నాయి. ఆర్సీబీని కేకేఆర్‌ సునాయాసంగానే ఓడిస్తుందని పలువురు విశ్లేషకుల మాట. ఇక్కడ టీమిండియా మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌ మాత్రం అడుగుముందుకేసి అసలు ఆర్సీబీ పోటీ ఇస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. కేకేఆర్‌కు ఆర్సీబీ ప్రత్యర్థే కాదని తనదైన శైలిలో తేల్చిపారేశాడు. అయితే మ్యాచ్‌ చూస్తే ఆర్సీబీకి కేకేఆర్‌ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో గంభీర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ ఫ్యాన్స్‌ అయితే  గంభీర్‌ను ఏకీపారిస్తున్నారు. ‘ ఏం గంభీర్‌.. మ్యాచ్‌ చూశావా.. ఇప్పుడేమంటావ్‌?’ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 

‘ప్రి మ్యాచ్‌ విశ్లేషణలో కేకేఆర్‌కు ఆర్సీబీ పోటీ కాదన్నావ్‌.. మేము టైటిల్‌ హెల్టర్స్‌ అని గారాలు పోయావ్‌.. మరి ఇప్పుడు ఏమైంది’అని ఒక అభిమాని ట్రోల్‌ చేయగా,  ‘ఈ సీజన్‌లో సీఎస్‌కే నమోదు చేసిన అ‍త్యల్ప స్కోరు చెత్త రికార్డును కూడా కేకేఆర్‌ అధిగమించలేకపోయింది.. చూశావా గంభీర్‌’ అని మరో అభిమాని సెటైర్‌ వేశాడు. ‘ గంభీర్‌ చెప్పింది నిజమే.. ఆర్సీబీ-కేకేఆర్‌ మ్యాచ్‌ ఆసక్తి ఉండదన్నాడు. అదే జరిగింది. కేకేఆర్‌ను ఆర్సీబీ చుట్టేసింది. ఒక క్లబ్‌ టీమ్‌ మాదిరిగా కేకేఆర్‌ తేలిపోయింది’ అని మరొక అభిమాని ట్రోల్‌ చేశాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత కేకేఆర్‌ను 84 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ఆర్సీబీ.. ఆపై లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో ఛేదిందిచింది. కేకేఆర్‌ విధించిన 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో దేవదూత్‌ పడిక్కల్, ఫించ్‌లు కలిసి మొదటి వికెట్‌కు  46 పరుగులు జోడించగా,  ఆ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. గురుకీరత్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి(18 నాటౌట్‌; 17 బంతుల్లో 2 ఫోర్లు), గుర్‌కీరత్‌ మన్‌(21 నాటౌట్‌; 26 బంతుల్లో 4 ఫోర్లు) సమయోచితంగా ఆడి ఘన విజయంలో పాలు పంచుకున్నారు.

మరిన్ని వార్తలు