ఐపీఎల్‌ అభిమానులకు డబుల్‌ మజా

3 Oct, 2020 08:06 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ఐపీఎల్‌ మొదలై రెండు వారాలైంది. ఈలోపే రెండు సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లు అయ్యాయి. సిక్సర్లు మైదానాన్ని దాటుతున్నాయి. ఫోర్లయితే పదేపదే బౌండరీలైన్‌ను తాకుతున్నాయి. పరుగుల వరదే వరద. ఇన్నీ జరుగుతున్నా ఏదో వెలితి! అదే... వారాంతపు వినోదం డబుల్‌ మ్యాచ్‌ల హంగామా. ఇప్పుడా వెలతి తీరబోతోంది. ఇకపై శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌ల మజా క్రికెట్‌ ప్రియులను అలరించనుంది.  

నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ క్యాపిటల్స్‌ 
ఇప్పటిదాకా విజయాల పరంగా, ఆటగాళ్ల పరంగా సమఉజ్జీలుగా నిలిచిన రెండు జట్ల మధ్య జరిగే పోరులో బ్యాటా, బంతా ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. రెండింట నెగ్గి ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి. కానీ ఈ సీజన్‌లో ఈ రెండు ప్రత్యర్థులు తలపడటం ఇదే మొదటిసారి. ఇక పోటీ విషయానికొస్తే యువకులు, విదేశీ ఆల్‌రౌండర్ల సమతూకంగా ఉన్న రెండు జట్ల మధ్య శనివారం రాత్రి ఆసక్తికర మ్యాచ్‌ జరగడం ఖాయం. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్, శుబ్‌మన్‌ గిల్, రసెల్, మోర్గాన్‌లతో కూడిన కోల్‌కతా, రిషభ్‌ పంత్, స్టొయినిస్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. (‘ప్రియ’మైన విజయం)

కోల్‌కతా మెరుగ్గా ఉంది. యువ పేసర్లు శివమ్‌ మావి, నాగర్‌కోటి గత మ్యాచ్‌ను తమ బౌలింగ్‌ సత్తాతో శాసించారు. అయితే ఓపెనింగ్‌లో నరైన్‌తో సమస్య ఏర్పడటంతో రిజర్వ్‌ ఓపెనర్‌ టామ్‌ బాంటన్‌ను దించుతుందా లేక విన్నింగ్‌ కాంబినేషన్‌నే కొనసాగిస్తుందో చూడాలి. క్యాపిటల్స్‌ విషయానికొస్తే గాయంతో దూరమైన ఢిల్లీ సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడని కోచ్‌ రియాన్‌ హారిస్‌ వెల్లడించారు. గత మ్యాచ్‌లో తమ జట్టు ఆశించిన మేర ఆడలేకపోయిందని... ఈ సారి తప్పకుండా రాణిస్తామని చెప్పారు.

బెంగళూరు వర్సెస్ రాజస్తాన్‌ 
ఒంట్లో ఉన్న నీటినంతా పీల్చే మ్యాచ్‌ ఇది. నిప్పులు చిమ్మే వేడిలో సీజన్‌లో తొలిసారి మధ్యాహ్నం జరిగే పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు  తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతున్నా... అక్కడ (యూఏఈలో) మాత్రం ఈ ఆట 2 గంటల నుంచే జరగడం ఆటగాళ్లకు కాస్త ఇబ్బందికరం. ఇది ప్రదర్శనపై ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశముంది. గత మ్యాచ్‌లో భారీస్కోర్లతో పాటు సూపర్‌ ఓవర్‌ విజయంతో ఉన్న బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉండగా... బ్యాటింగ్‌ వైఫల్యంతో చతికిలబడిన రాజస్తాన్‌ను గత ఓటమి కలవరపరుస్తోంది. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు పరుగులు చేసిన రాజస్తాన్‌ ఆట గతపోరులో తిరగబడింది.

ముఖ్యంగా కెప్టెన్‌ స్మిత్, సామ్సన్‌ల సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపించింది. వీళ్లిద్దరితో పాటు తేవటియా, ఆల్‌రౌండర్‌ ఆర్చర్‌ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బెంగళూరు బెంగంతా సారథి కోహ్లిపైనే పెట్టుకుంది. మూడు మ్యాచ్‌లాడిన ఈ స్టార్‌ 25 పరుగులైనా చేయలేకపోయాడు. లీగ్‌ చరిత్రలోనే 5000 క్లబ్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి ఫామ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. అతను ఫామ్‌లోకి రావాలని బలంగా కోరుకుంటుంది.  

మరిన్ని వార్తలు