ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో కరోనా

8 Jul, 2021 05:23 IST|Sakshi
జపాన్‌ పతాకధారి సుసాకికి జాతీయ పతాకం అందజేస్తున్న ఆ దేశ ఒలింపిక్‌ కమిటీ చైర్మన్‌ యామషిటా

టోక్యో: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా టోక్యో ఒలింపిక్స్‌ను ఏదో ఒక రూపంలో కరోనా వెంటాడుతూనే ఉంది. తాజాగా అథ్లెట్ల ‘క్రీడా గ్రామం’లో పని చేస్తున్న సిబ్బందిలో ఇద్దరు కోవిడ్‌–19 పాజిటివ్‌గా తేలారు. నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరు గేమ్స్‌ విలేజ్‌తో సంబంధం లేని మరో ఇద్దరు బయటి వ్యక్తులతో కలిసి భోజనం చేసినట్లుగా సమాచారం. ఒలింపిక్స్‌ చేరువవుతున్న సమయంలో ఇప్పటికే ఉగాండాకు చెందిన అథ్లెట్, కోచ్‌... మరో సెర్బియా అథ్లెట్‌ కూడా కరోనా బారిన పడటంతో కలవరం పెరిగింది. ఈ స్థితిలో తాజా రెండు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా పరిణామాలతో ఇప్పటికే టోక్యోలో ఉన్న ఆస్ట్రేలియా బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వీరిలో 98 శాతం వ్యాక్సిన్‌ తీసుకొని ఉన్నా సరే... ఒలింపిక్‌ నిర్వాహకుల నిబంధనలతో పాటు తమ ఆటగాళ్లు సొంతంగా ఇతర కఠిన నిబంధనలు పాటించాలని ఆస్ట్రేలియా ఒలింపిక్‌ సంఘం సూచించింది. మరోవైపు జపాన్‌ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్‌ టార్చ్‌ రిలేలను దాదాపు అన్ని చోట్లా రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఒక్క చోటకు చేరకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. టోక్యోకు దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న దీవి ‘ఒగాసవారా’లో మాత్రం షెడ్యూల్‌ ప్రకారం టార్చ్‌ రిలే కొనసాగుతుంది.    
 

మరిన్ని వార్తలు