U-19 Womens T20 WC: వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్‌ కొన్న తల్లి కథ

29 Jan, 2023 10:58 IST|Sakshi

బిడ్డ దేశం కోసం ఆడుతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి బిడ్డ ఆటను కళ్లారా చూడాలని స్మార్ట్‌ఫోన్‌ను కూడా కాదని ఇన్వర్టర్‌ కొన్న ఒక తల్లి కథ తప్పక చదవాల్సిందే.

విషయంలోకి వెళితే..  షఫాలీ వర్మ నేతృత్వంలోని టీమిండియా అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో  సూపర్‌ ఆటతీరుతో అదరగొట్టి టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇదే టీమ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన అర్చనా దేవి బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించింది. టోర్నీలో ఆమె మంచి ప్రదర్శననే కనబరిచింది. ఆదివారం భారత్‌, ఇంగ్లండ్‌ మహిళల మధ్య అండర్‌-19 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ జరగనుంది.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో కూగ్రామంగా ఉన్న ఉన్నావ్‌లో 24 గంటలు కరెంటు ఉండడం అనేది గగనం. కేవలం ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఉంటుందట. అండర్‌-19 టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌ చేరిందన్న సంగతి సావిత్రి తన కూతురు అర్చన ద్వారా తెలుసుకొని తెగ సంతోషపడింది. ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో బిడ్డ ఆటను కళ్లారా చూడాలని భావించింది. కానీ కరెంటు సమస్య ఉండడంతో మ్యాచ్‌ చూడడం కాస్త కష్టమే. కూతురు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌పై ఆమెకు నమ్మకం లేదు. ఎందుకంటే ఫోన్‌లో బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియని పరిస్థితి.

అందుకే సావిత్రి ఒక ఆలోచన చేసింది. ఊర్లో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి తన బిడ్డ అర్చనా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతుందని.. ఆ మ్యాచ్‌ను చూడాలనుకుంటున్నానని.. తలా ఇంత డబ్బులేసుకొని ఒక ఇన్వర్టర్‌ కొందామని చెప్పింది. తమ గ్రామానికి చెందిన ఒక ఆడబిడ్డ దేశానికి ఆడుతుందంటే అది మాకు గర్వకారణమే అని భావించిన ఊరివాళ్లు కూడా సావిత్రికి అండగా నిలబడ్డారు. ప్రతీ ఇంటి నుంచి వచ్చిన రూపాయితో సావిత్రి మొత్తానికి ఇన్వర్టర్‌ కొనేసింది. ఇక ఆదివారం ఊరి సమక్షంలో తన కూతురు మ్యాచ్‌ను చూడడానికి సావిత్రి అంతా సిద్ధం చేసుకుంది. 

''మా ఊళ్లో కరెంటు 24 గంటలు ఉంటుందనే దానిపై నమ్మకం లేదు. మొబైల్‌ ఫోన్‌లో మ్యాచ్‌ చూద్దామన్నా బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. నా కూతురు ఆడనున్న వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఒక్క క్షణం కూడా మిస్‌ కాకూడాదని అనుకుంటున్నా. అందుకే ఊరివాళ్లతో మాట్లాడి డబ్బు పోగు చేసి ఇన్వర్టర్‌ కొనుక్కున్నా. ఇప్పుడు నా కూతురు ఆటను చూడడానికి ఎలాంటి అడ్డంకులు లేవు'' అంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొంది.


 
ఇక క్రికెటర్‌ అర్చనా దేవి తల్లి సావిత్రి జీవితంలో చాలా ఎదగాలని కోరుకుంది. కానీ ఆమె కల నెరవేరకపోయినా కూతురు రూపంలో దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన సావిత్రి.. అర్చనను మాత్రం కష్టపడి పెంచింది. ''ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకొని పంట పండించడంతో పాటు రెండు ఆవుల నుంచి వచ్చిన పాలను అమ్మి కూతురును పెంచి పెద్ద చేశాను. అయితే అర్చనను చిన్నప్పుడే హాస్టల్‌కు పంపించిన సావిత్రి గంజిలోని మురదాబాద్‌లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదివించింది.

కూతురును దూరం పెట్టిందని ఊరి వాళ్లంతా సూటిపోటి మాటలు అనేవారు. నాలాగా నా కూతురు పెరగకూడదనే ఎంత కష్టమైనా తనను చదివించుకున్నాను. ఇప్పుడు తను ఉన్నత స్థాయికి ఎదగడంతో తిట్టినోళ్ల నోటి నుంచే పొగడ్తలు రావడం సంతోషంగా అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇక అండర్‌-19 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ జరగడానికి ముందు టీమిండియా మహిళల జట్టును ఒలింపియన్‌.. భారత్‌ స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారితో సరదాగా గడిపిన నీరజ్‌ చోప్రా అమ్మాయిలకు తన విలువైన సూచనలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది.

చదవండి: 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్‌ మెడల్‌

మరిన్ని వార్తలు