సెమీఫైనల్లో యువ భారత్‌

28 Dec, 2021 04:52 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌పై 4 వికెట్లతో విజయం

అండర్‌–19 ఆసియా కప్‌

U19 Asia Cup 2021, India Semi Finals: సెమీఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఆకట్టుకుంది. అండర్‌–19 ఆసియా కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో యువ భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఇజాజ్‌ అహ్మద్‌ (86 నాటౌట్‌; 1 ఫోర్, 7 సిక్స్‌లు), కెప్టెన్‌ సులేమాన్‌ సఫీ (73; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్‌ 48.2 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులు సాధించింది.

హర్నూర్‌ సింగ్‌ (65; 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ చేశాడు. రాజ్‌ బవా (43 నాటౌట్‌; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 197 పరుగుల వద్దే భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయినా... రాజ్, కౌశల్‌ తాంబే (35 నాటౌట్‌; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు అభేద్యంగా 65 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ గ్రూప్‌లో రెండు విజయాలు సాధించిన భారత్‌తో పాటు ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచిన పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌ ‘బి’ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక సెమీస్‌ చేరాయి. నేడు బంగ్లాదేశ్, లంక మధ్య జరిగే లీగ్‌ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో గురువారం జరిగే సెమీస్‌లో భారత్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు