అద్భుత రనౌట్‌... శ్రీలంకపై అఫ్గన్‌ సంచలన విజయం.. సెమీ ఫైనల్‌లో అడుగు...

28 Jan, 2022 15:39 IST|Sakshi
PC: ICC

ICC U19 World Cup 2022: 25 బంతులు... చేయాల్సినవి 5 పరుగులు.. చేతిలో ఒక వికెట్‌. ఓ క్రికెట్‌ జట్టు మ్యాచ్‌ గెలవడానికి ఈ సమీకరణ చాలు. కానీ... శ్రీలంకను దురదృష్టం వెక్కిరించింది. అఫ్గనిస్తాన్‌ అద్భుత రనౌట్‌ చేయడంతో విజయం ఆ జట్టు చేజారింది. అంతేకాదు మెగా టోర్నీలో సెమీస్‌ చేరాలన్న ఆశలు గల్లంతయ్యాయి. కాగా వెస్టిండీస్‌ వేదికగా ఐసీసీ అండర్‌ 19 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ మధ్య గురువారం క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు బిలాల్‌ సయేదీ 6, ఖరోటే 13 పరుగులకే పెవిలియన్‌ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన అల్లా నూర్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అబ్దుల్‌ హైదీ 37, నూర్‌ అహ్మద్‌ 30 పరుగులతో రాణించారు. దీంతో అఫ్గన్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 134 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

ఆఖరి రనౌట్‌తో
ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ చమిందు విక్రమ సింఘే ఒక్కడే డబుల్‌ డిజిట్‌(16) స్కోరు చేయగలిగాడు. మరో ఓపెనర్‌ సదిశ రాజపక్స డకౌట్‌ కాగామిడిలార్డర్‌ దారుణంగా విఫలమైంది. వరుసగా 2,2,1,3,2 స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. చివర్లో దునిత్‌ 34, రవీన్‌ డి సిల్వా 21 మెరుపులు మెరిపించారు.

వినుజ రణ్‌పల్‌ 11 పరుగులతో క్రీజులో ఉండగా... అఫ్గన్‌ బౌలర్‌ నవీద్‌ సంధించిన బంతిని ఆడే క్రమంలో రనౌట్‌కు ఆస్కారం ఏర్పడింది. దీంతో  శ్రీలంక కథ ముగిసింది. ఇన్నింగ్స్‌లో ఇది నాలుగో రనౌట్‌ కావడం గమనార్హం. ఇక నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ చేరిన అఫ్గన్‌ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. సెమీ ఫైనల్‌లో అఫ్గనిస్తాన్‌ ఇంగ్లండ్‌తో తలపడనుంది.

స్కోర్లు:
అఫ్గనిస్తాన్‌ అండర్‌ 19 జట్టు: 134 (47.1 ఓవర్లు)
శ్రీలంక అండర్‌ 19 జట్టు- 130 (46 ఓవర్లు)

చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్‌ ప్లేయర్లు... ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0!
IND vs WI: టీమిండియాతో సిరీస్‌.. వెస్టిండీస్ జ‌ట్టులో గొడ‌వ‌లు.. పొలార్డ్‌పై సంచలన ఆరోపణలు!

మరిన్ని వార్తలు