U19 WC Final- Yash Dhull: జట్టులో స్టార్స్‌ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్‌ పెడతాం.. కోహ్లి మాకు ఏం చెప్పాడంటే..

5 Feb, 2022 13:45 IST|Sakshi

Under 19 World Cup Final India Vs England -Yash Dhull Comments: ‘‘జట్టులో స్టార్స్‌ అంటూ ఎవరూ లేరు. మేమంతా సమష్టిగా ఆడతాం. ఎవరో ఒ‍క్కరు బాగా ఆడినంత మాత్రాన ఇదంతా సాధ్యం కాదు. ప్రతి ఆటగాడు రాణిస్తేనే గెలుపు అవకాశాలు పెరుగుతాయి.  విజయాల్లో ప్రతి ఒక్కరు తమ వంతు  పాత్ర పోషించారు. అలా ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇప్పుడు మా దృష్టి అంతా ఫైనల్‌ మ్యాచ్‌ మీదే ఉంది’’ అని అండర్‌ 19 భారత జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ అన్నాడు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ తుదిమెట్టు వరకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు.

కాగా అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో యశ్‌ ధుల్‌ అద్భుత సెంచరీతో మెరవగా.. వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ 94 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో కంగారూలను మట్టికరిపించి యువ భారత్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఇంగ్లండ్‌తో తుదిపోరులో తలపడనుంది.

ఈ నేపథ్యంలో యశ్‌ ధుల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌ జట్టు చాలా బాగుంది. టోర్నీ ఆసాంతం వారు బాగా ఆడారు. ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదు. సహజమైన ఆట తీరుతో ముందుకు సాగుతాం. వందుకు వంద శాతం కష్టపడతాం. ఇక ఫలితం ఎలా ఉంటుందో మ్యాచ్‌ తర్వాత మీరే చూస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌, అండర్‌ 19 వరల్డ్‌కప్‌ విజేత విరాట్‌ కోహ్లితో సంభాషణ గురించి చెబుతూ.. ‘‘మాకు విష్‌ చేయడానికి కోహ్లి కాల్‌ చేశాడు.

బాగా ఆడుతున్నామని చెప్పాడు. గేమ్‌ ప్లాన్‌ గురించి మాట్లాడాడు. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఆత్మవిశ్వాసం నింపాడు. సీనియర్లు ప్లేయర్ల మద్దతు లభించడం సంతోషకరం’’అని హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా కెప్టెన్‌గా, ఆటగాడిగా తన శక్తి మేరకు జట్టు, దేశం గెలుపు కొరకు కృషి చేస్తానని యశ్‌ ధుల్‌ వ్యాఖ్యానించాడు. భారత్‌కు ఐదో టైటిల్‌ అందించేందుకు శాయశక్తులా కృషి​ చేస్తామని పేర్కొన్నాడు. 

చదవండి: U19 WC Aus Vs Afg: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం
Yash Dhull: యశ్‌ ధుల్‌ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్‌.. క్రికెట్‌ పుస్తకాల్లో పేరుందా!

>
మరిన్ని వార్తలు