Gongadi Trisha: శెభాష్‌ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు

30 Jan, 2023 10:45 IST|Sakshi

ICC U19 Women T20 World Cup- Gongadi Trisha: అండర్‌ – 19 టీ20 వరల్డ్‌ కప్‌లో తెలంగాణ తేజం, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష అద్భుత ప్రతిభ కనబర్చింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో రాణించి వరల్డ్‌కప్‌ సాధనలో తనవంతు పాత్ర పోషించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయభేరి మోగించి కప్‌ సొంతం చేసుకుంది. 68 పరుగులకే ఇంగ్లాడ్‌ జట్టును ఆలౌట్‌ చేసిన భారత్‌.. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టగా త్రిష అద్భుత ఆటతీరును ప్రదర్శించింది.

సంబరాల్లో భద్రాచలం వాసులు
24 పరుగులతో అజేయంగా నిలిచి సౌమ్య తివారితో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి అండర్‌–19 వరల్డ్‌ కప్‌ను దేశానికి అందించింది. ఉమెన్‌ ఆఫ్‌ ద సీరీస్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ను క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పింది. దీంతో త్రిష సొంతూరైన భద్రాచలంలో క్రీడాభిమానుల ఆనందానికి హద్దే లేదు. మ్యాచ్‌ ఆద్యంతం టీవీల్లో వీక్షించారు. గెలిచిన అనంతరం రోడ్లపైకి వచ్చి సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చుతూ జయహో భారత్‌ నినాదాలు చేశారు.- భద్రాచలం

తొలి వరల్డ్‌కప్‌ టోర్నీలో ‘మెరిసిన త్రిష’
భద్రాచలంలో జిమ్‌ నిర్వహించే గొంగడి రామిరెడ్డి కుమార్తె అయిన త్రిషను చిన్నతనం నుంచే క్రికెట్‌లో తీర్చిదిద్దారు. ఎనిమిదేళ్ల వయసులోనే జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీల్లో రాణించి ఉమెన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచింది.

స్థానిక కళాశాల క్రీడా మైదానంలో త్రిషకు ఓనమాలు నేర్పిన రామిరెడ్డి, తన కూతురును అంతర్జాతీయ క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌కు కుటుంబాన్ని తరలించి, త్రిషను ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దారు.

రామయ్య ఆశీస్సులు ఉండాలి
ఇటీవల అండర్‌–19 జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో రాణించటంతో అండర్‌–19 వరల్డ్‌ కప్‌ జట్టుకు త్రిషను ఎంపిక చేశారు. అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో తొలిసారిగా ఎంపికవడంతో పాటు తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడి వరల్డ్‌కప్‌ సాధనకు దోహదం చేయడం విశేషం.

స్కాట్‌లాండ్‌తో ఆడిన ఆటలో  51 బంతుల్లో 57 పరుగులు సాధించింది. భవిష్యత్‌లో మరింతగా రాణించాలని, త్రిషకు ‘భద్రాద్రి రామయ్య’ ఆశీస్సులు ఉండాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

చదవండి: T20 WC: 2005 వరల్డ్‌కప్‌ టైమ్‌లో పుట్టినోళ్లు! ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కుల్దీప్‌ కోచ్‌ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి.. 
IND vs NZ: కుల్దీప్‌ మ్యాజిక్‌ డెలివరి.. దెబ్బకు కివీస్‌ బ్యాటర్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు