పృథ్వీ షా చేతికి మైక్‌ ఇచ్చిన ద్రవిడ్‌.. నవ్వాపుకొన్న గిల్‌! వీడియో చూశారా?

31 Jan, 2023 13:37 IST|Sakshi
PC: BCCI

U19 Women T20 WC- Team India: మహిళా క్రికెట్‌లో అండర్‌ 19 స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ట్రోఫీని కైవసం చేసుకుని నీరాజనాలు అందుకుంటోంది టీమిండియా. షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా ప్లేయర్లు ఈ ఘనత సాధించి చరిత్రలో తమ పేర్లను పదిలం చేసుకున్నారు. భారత అమ్మాయిలు ఇంతవరకు ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవలేదన్న అపవాదును తుడిచివేస్తూ రికార్డు సృష్టించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం నాటి విజయం తర్వాత షఫాలీ బృందంపై సర్వత్రా ప్రశంసల వర్షం కొనసాగుతోంది. అయితే, వీటిలో బీసీసీఐ షేర్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమ రెండో మ్యాచ్‌ సందర్భంగా.. ప్రపంచకప్‌ గెలిచిన మహిళా జట్టుకు పురుషుల టీమ్‌ శుభాభినందనలు తెలిపింది. ఇందులో భాగంగా.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తొలుత విష్‌ చేసి టీమిండియా ఓపెనర్‌ పృథ్వీ షా చేతికి మైక్‌ అందించాడు.

నవ్వాపుకొన్న గిల్‌
ఈ క్రమంలో పృథ్వీ విష్‌ చేస్తుండగా.. జట్టు మొత్తం అతడిని తదేకంగా చూస్తూ నిల్చుని ఉన్నారు. ఇక మరో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మరీ నవ్వాపుకొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్‌.. ‘‘పాత రోజుల్లో ఏమేం చిలిపి పనులు చేశారో.. అవన్నీ గుర్తొచ్చినట్లున్నాయి! అందుకేనేమో ముసిముసిగా నవ్వుతున్నాడు.

ఇద్దరు కెప్టెన్లు.. కోచ్‌ ఒక్కడే
అప్పుడు తనకు డిప్యూటీగా ఉన్న గిల్‌తో ఓపెనింగ్‌ స్థానం కోసం ఇప్పుడు పృథ్వీ పోటీపడుతున్నాడు! ఏమిటో!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా పృథ్వీ షా టీమిండియాకు 2018లో అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించాడు. అప్పుడు శుబ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

ఇక ప్రస్తుత జట్టులో ఉన్న ఇషాన్‌ కిషన్‌ కూడా అండర్‌-19 జట్టుకు సారథ్యం వహించినవాడే! అయితే, అతడి నేతృత్వంలోని టీమిండియా 2016 ఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో ఓడిపోయింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ ద్రవిడ్‌ ఈ జూనియర్‌ టీమ్‌లకు కోచ్‌గా ఉండటం విశేషం. 
చదవండి: T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్‌’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి!

మరిన్ని వార్తలు