U19 Womens T20 WC: టీమిండియా శుభారంభం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం

15 Jan, 2023 09:54 IST|Sakshi

బెనోని: తొలి అండర్‌–19 టి20 ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఘన విజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్‌–19 మహిళల టీమ్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... భారత్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. షబ్నమ్‌ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టి వాన్‌ రెన్స్‌బర్గ్‌ (23) సఫారీ జట్టుకు శుభారంభం అందించగా, సోనమ్‌ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి సిమోన్‌ లోరెన్స్‌ (44 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్‌) 4 ఫోర్లు, సిక్స్‌ బాదింది.

అయితే ఆ తర్వాత ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేయడంలో సఫలం కాగా, మ్యాడిసన్‌ ల్యాండ్స్‌మన్‌ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. ఛేదనలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్వేత సెహ్రావత్‌ (57 బంతుల్లో 92 నాటౌట్‌; 20 ఫోర్లు), కెప్టెన్‌ షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగిపోయారు. నిని వేసిన ఓవర్లో షఫాలీ వరుసగా 4, 4, 4, 4, 4, 6తో ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు శ్వేత తన దూకుడును తగ్గించకుండా దూసుకుపోయింది.

గొంగడి త్రిష (15) తొందరగానే వెనుదిరిగినా... శ్వేత చివరి వరకు నిలబడటంతో భారత్‌కు గెలుపు సులువైంది. ఓపెనర్‌ శ్వేత 7 ఓవర్లలో కనీసం రెండు ఫోర్ల చొప్పున కొట్టడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, యూఏఈ ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచాయి. 

మరిన్ని వార్తలు