చెల‌రేగిన టీమిండియా.. 326 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం

23 Jan, 2022 05:56 IST|Sakshi

యువ భారత్‌ 405/5

అంగ్‌కృష్, రాజ్‌ బావా సెంచరీలు

అండర్‌–19 ప్రపంచకప్‌

టరోబా (ట్రినిడాడ్‌): అండర్‌–19 ప్రపంచకప్‌లో ఉగాండాతో జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో యువ భార‌త్ 326 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఉగాండాకు అలసటే తప్ప 50 ఓవర్లపాటు ఊరటే లేదు. ఈ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఉప్పెనలా చెలరేగారు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ రాజ్‌ బావా (108 బంతుల్లో 162 నాటౌట్‌; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), ఓపెనర్‌ అంగ్‌కృష్‌ రఘువంశీ (120 బంతుల్లో 144; 22 ఫోర్లు, 4 సిక్సర్లు) ఎదురే లేని బ్యాటింగ్‌తో ఉగాండా బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. గ్రూప్‌ ‘బి’ నుంచి ఇది వరకే క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత అండర్‌–19 జట్టు అనామక జట్టుపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు చేసింది. కాగా 406 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా కేవ‌లం 79 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్లలో కెప్టెన్‌ నిశాంత్ సింధు నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, హంగర్గేకర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

టాపార్డర్‌లో ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌ (15), కెప్టెన్‌ నిషాంత్‌ సింధు (15) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే మరో ఓపెనర్‌ రఘువంశీ, రాజ్‌ బావా దుర్బేధ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు శతక్కొట్టడంతో పాటు మూడో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 291 పరుగుల వద్ద రఘువంశీ పెవిలియన్‌ చేరడంతో... క్రీజులో పాతుకుపోయిన రాజ్‌ బావా తర్వాత వచ్చిన కౌశల్‌ తాంబే (15), దినేశ్‌ బన (22), అనీశ్వర్‌ గౌతమ్‌ (12 నాటౌట్‌)లతో కలిసి జట్టు స్కోరును 400 పరుగులు దాటించాడు. మనోళ్లు ఇంతలా చెలరేగినప్పటికీ కుర్రాళ్ల వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కాదు. 2004 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై భారత అండర్‌–19 జట్టు 425/3తో అత్యధిక స్కోరు నమోదు చేసింది. భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. అండర్‌–19 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా శిఖర్‌ ధావన్‌ (155) రికార్డును రాజ్‌ బావా అధిగమించాడు.

మరిన్ని వార్తలు