T20 World Cup 2022 UAE VS NED: చరిత్ర సృష్టించిన యూఏఈ ఆల్‌రౌండర్‌

16 Oct, 2022 17:07 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌లో తొలి రోజే సంచలనాల మోత మోగింది. ఓపెనింగ్‌ మ్యాచ్‌లో పసికూన్‌ నమీబియా.. ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యే షాకివ్వగా.. యూఏఈ-నెదర్లాండ్స్‌ మధ్య జరుగుతున్న రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ రికార్డు నమోదైంది. యూఏఈ ఆటగాడు అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌.. టీ20 వరల్డ్‌కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

అయాన్‌.. 16 ఏళ్ల 335 రోజుల వయసులోనే టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ ఆడి రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ అమీర్‌ పేరిట ఉండేది. అమీర్‌.. 17 ఏళ్ల 55 రోజుల వయసులో టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడగా.. అయాన్‌ తాజాగా అమీర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

టీ20 వరల్డ్‌కప్‌ ఆడిన అత్యంత పిన్నవయస్కుల జాబితాలో అయాన్‌, అమీర్‌ తర్వాత ఆఫ్ఘన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (17 ఏళ్ల 170 రోజులు), పాకిస్తాన్‌ ఆటగాడు అహ్మద్‌ షెహజాద్‌ (17 ఏళ్ల 196 రోజులు), ఐర్లాండ్‌ ప్లేయర్‌ జార్జ్‌ డాక్రెల్‌ (17 ఏళ్ల 282 రోజులు) వరుసగా 3 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు.

ఇక ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అత్యంత పెద్ద వయసు కలిగిన ఆటగాడి విషయానికొస్తే.. నెదర్లాండ్స్‌కు చెందిన స్టెఫాన్‌ మైబుర్గ్‌కు ఆ ఘనత దక్కింది. మైబుర్గ్‌.. 38 ఏళ్ల 230 వయసులో టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యంత పిన్న వయస్కుడు (అయాన్‌), అతి పెద్ద వయసు కలిగిన ఆటగాడు (మైబుర్గ్‌) ఇలా ఒకే మ్యాచ్‌లో ఎదురురెదురు పడటం మరో విశేషం.

ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన క్రికెటర్‌ రికార్డు హాంగ్‌కాంగ్‌ ఆటగాడు ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ పేరిట ఉంది. క్యాంప్‌బెల్‌.. 2016 వరల్డ్‌కప్‌లో 44 ఏళ్ల 33 రోజుల వయసులో టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడాడు. 

ఇదిలా ఉంటే, యూఏఈ-నెదర్లాండ్స్‌ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్‌ 7 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 

మరిన్ని వార్తలు