యూఏఈ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం

21 Apr, 2021 19:05 IST|Sakshi

దుబాయ్‌: యూఏఈ క్రికెటర్‌ ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది.  ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిలోని ఆరు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. 2019 అక్టోబర్‌లో ఖాదీర్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.  ఐసీసీ ఆర్టికల్ 2.4.4, ఆర్టికల్ 2.3.2,ఆర్టికల్ 2.4.4, ఆర్టికల్ 2.4.5,ఆర్టికల్ 2.4.6, ఆర్టికల్ 2.4.7 కింద వివిధ అవినీతి ఆరోపణలతో పాటు ఫిక్సింగ్‌, బుకీలకు సమాచారం అందించడం, దర్యాప్తుకు సహకరించకపోవడం వంటివి చేసినందుకు ఖాదీర్‌పై ఎలాంటి మ్యాచ్‌లు ఆడకుండా ఐదేళ్ల పాటు నిషేధం పడింది. కాగా ఖదీర్‌ అహ్మద్‌ యూఏఈ తరపున 11 వన్డేల్లో 8 వికెట్లు, 10 టీ20ల్లో 9 వికెట్లు తీశాడు.

ఇటీవలే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం పలువురు మాజీ ఆటగాళ్లపై వరుసగా నిషేధాలు విధిస్తూ వచ్చింది. శ్రీలంక మాజీ క్రికెటర్‌ దిల్హారా లోకుహెట్టిగే‌పై ఎనిమిదేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్‌  ఆరోపణలు రావడంతో దిల్హారాపై సుదీర్ఘ నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. అంతకముందు జింబాబ్వే మాజీ క్రికెటర్‌ హీత్‌ స్ట్రిక్‌పై కూడా అవినీతి చర్యల కింద ఐసీసీ అవినీతి నిరోధక విభాగం 8 ఏళ్ల బ్యాన్‌ విధించింది. 
చదవండి: మాజీ క్రికెటర్‌పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం

>
మరిన్ని వార్తలు