Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా..

13 Oct, 2021 07:31 IST|Sakshi

ఉబెర్‌ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు

అర్హుస్‌ (డెన్మార్క్‌): ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు లేకపోయినా... గాయం కారణంగా మరో స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ సేవలు అందుబాటులో లేకపోయినా... భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు అద్భుత ఆటతీరుతో ఉబెర్‌ కప్‌ టోర్నమెంట్‌లో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–1తో స్కాట్లాండ్‌ జట్టును ఓడించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసిన భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్‌ జట్లు రెండేసి విజయాలు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత పొందాయి. నేడు థాయ్‌ లాండ్, భారత్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ద్వారా గ్రూప్‌ విజేత ఎవరో తేలుతుంది. 2014, 2016ల లో ఉబెర్‌కప్‌లో సెమీఫైనల్‌ చేరుకొని తమ అత్యు త్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు 2018లో లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్‌ మళ్లీ నాకౌట్‌ దశకు చేరుకుంది.  

స్కాట్లాండ్‌తో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 104వ ర్యాంకర్‌ మాళవిక బన్సోద్‌ 13–21, 9–21తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ క్రిస్టీ గిల్మోర్‌ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అదితి భట్‌ 21–14, 21–8తో రాచెల్‌ సుగ్డెన్‌పై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో తనీషా–రితూపర్ణ ద్వయం 21–11, 21–8తో జూలీ–క్లారా టోరెన్స్‌ జోడీపై గెలిచి భారత్‌ ఆధిక్యాన్ని 2–1కి పెంచింది. నాలుగో మ్యాచ్‌లో తస్నీమ్‌ మీర్‌ 21–15, 21–6తో లౌరెన్‌ మిడిల్‌టన్‌ను ఓడించి 3–1తో భారత్‌ విజయాన్ని ఖరారు చేసింది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో త్రిసా జాలీ–గాయత్రి గోపీచంద్‌ జోడీ 21–8, 19–21, 21–10తో క్రిస్టీ గిల్మోర్‌–ఎలానోర్‌ జంటపై గెలిచింది. 

చదవండి: DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు?

మరిన్ని వార్తలు