చైనాకు షాకివ్వనున్న మరో రెండు దేశాలు.. వింటర్‌ ఒలింపిక్స్‌ బహిష్కరణ

9 Dec, 2021 17:37 IST|Sakshi

UK And Canada Boycotts China Winter Olympics:  చైనా రాజధాని బీజింగ్‌ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని బ్రిటన్‌, కెనడా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్,  కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో బుధవారం ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరగుతుందన్న కారణంగా ఈ దేశాలు శీతాకాల విశ్వక్రీడలను బహిష్కరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. 

ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఇదివరకే ప్రకటించాయి. అయితే, వరుసగా ఒక్కో దేశం ఒలింపిక్స్‌ను బహిష్కరించడంపై  చైనా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. కాగా, జపాన్, న్యూజిలాండ్‌ కూడా చైనా ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి కోవిడ్‌ ఉద్భవించిందన్న కారణంగా ఆయా దేశాలు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజింగ్‌ ఒలింపిక్స్‌ 2022 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగనున్నాయి.
చదవండి: IND A Tour Of SA: టీమిండియాలో ఒమిక్రాన్‌ కలకలం.. ఇద్దరికి పాజిటివ్‌..!

మరిన్ని వార్తలు