Ultimate Kho Kho- YSR District: ఖోఖో చిరుత సత్తా.. 2 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై!

25 Jul, 2022 13:44 IST|Sakshi

క్విక్‌ గన్‌.. రామ్మోహన్‌.. సీకేదిన్నె టు చెన్నై

కడప ఖోఖో చిరుతకు దక్కిన అవకాశం 

అల్టిమేట్‌ లీగ్‌లో ఆడనున్న కుర్రాడు 

ఆటలెందుకురా.. చదువుకో అన్న వారు ఉన్నారు.. అవకాశాలు రావడం లేదు.. ఇక ఆటలు ఆపేసేయ్‌ అని కుటుంబ సభ్యులు అన్నారు.. అయినా మొక్కవోని పట్టుదల, నిరంతరం శ్రమించే తత్వం.. కళ్లముందు తల్లిదండ్రుల పేదరికం..  వెరసి కోచ్‌ మార్గదర్శనంలో రాటుదేలాడు కాట్ల రామ్మోహన్‌.. ఖోఖో క్రీడను ప్రాణంగా భావించి సాధన చేస్తున్న పేదింటి బిడ్డకు పెద్ద అవకాశం లభించింది.

అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ పోటీల్లో చెన్నై క్విక్‌గన్స్‌ జట్టు రూ. 2లక్షలు వెచ్చించి రామ్మోహన్‌ను కొనుగోలు చేసింది. చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఖోఖో క్విక్‌గన్‌ రామ్మోహన్‌పై ప్రత్యేక కథనం.. 

కడప స్పోర్ట్స్‌: చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లెలోని ఎస్‌.వి.ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్‌ శిక్షణలో ఓనమాలు దిద్దుకున్న రామ్మోహన్‌ ఖోఖో క్రీడలో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. మండల పరిధిలోని ఆర్‌.టి.పల్లెకు చెందిన సాధారణ రైతుకూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మల కుమారుడైన కట్లా రామ్మోహన్‌ బయనపల్లెలోని ఎస్‌.వి. హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇక్కడే ఖోఖోలో ఓనమాలు నేర్చుకుని జాతీయస్థాయికి ఎదిగాడు. 

ప్రస్తుతం బాపట్ల జిల్లా ఇనకొల్లులోని డి.సి.ఆర్‌.ఎం.కళాశాలలో డిగ్రీ చదువుకుంటూ జె.పంగలూరులోని ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఛేజింగ్, రన్నింగ్‌లో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎస్‌జీఎఫ్‌ మొదలు జూనియర్స్, సీనియర్స్, ఖేలో ఇండియా ఇలా అన్ని విభాగాల్లో జాతీయస్థాయిలో పతకాలు సాధించి ఖోఖో చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకుని, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడీ యువ క్రీడాకారుడు. 

చెన్నై క్విక్‌గన్స్‌ జట్టుకు.. 
క్రికెట్‌ ప్రీమియర్‌లీగ్, బ్యాడ్మింటన్‌ ప్రీమియర్‌ లీగ్, ప్రొ కబడ్డీ లీగ్‌ వలనే ఖోఖో క్రీడలో సైతం అల్టిమేట్‌ ఖోఖో పేరుతో లీగ్‌ పోటీలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈనెల 14, 15 తేదీల్లో పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్‌హబ్‌లో తొలిసీజన్‌లో దేశవ్యాప్తంగా 6 ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసి క్రీడాకారులను కొనుగోలు చేశారు. ఇందులో చెన్నై క్విక్‌గన్స్‌ ఫ్రాంచైజీ రామ్మోహన్‌ను రూ. 2లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది.

దీంతో ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు నిర్వహించనున్న అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌లో చెన్నై క్విక్‌గన్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇతడికి చక్కటి అవకాశం లభించడం పట్ల జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె. రామసుబ్బారెడ్డి, కార్యదర్శి నరేంద్ర, ఎస్‌.వి.ఎయిడెడ్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు దీన్‌దయాళ్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.  

రామ్మోహన్‌ ఘనత 
►2015లో చత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన అండర్‌–14 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం 
►2017లో 63వ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 నేషనల్స్‌లో గోల్డ్‌మెడల్‌ 
►2018లో ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా అండర్‌–17 నేషనల్స్‌లో కాంస్యపతకం 
►2019లో పూణేలో నిర్వహించిన ఖేలో ఇండియా అండర్‌–17 నేషనల్స్‌లో రజతపతకం 
►2019లో గుజరాత్‌లో నిర్వహించిన జూనియర్‌ నేషనల్స్‌లో కాంస్యపతకం 
►2020లో అస్సాంలో నిర్వహించిన ఖేలోఇండియా అండర్‌–17 నేషనల్స్‌లో ప్రాతినిధ్యం 
►2021లో వరంగల్‌లో నిర్వహించిన సీనియర్‌ నేషనల్స్‌ (సౌత్‌జోన్‌)లో కాంస్యపతకం 
►2021లో మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సీనియర్‌ నేషనల్స్‌తో ప్రాతినిధ్యం

చదవండి: Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్‌ సేనకు భారీ షాక్‌! ఆలస్యంగా వెలుగులోకి..
Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్‌ సైతం!

మరిన్ని వార్తలు