ఆసీస్‌తో టెస్టు సిరీస్‌: ఉమేశ్‌ యాదవ్‌ అవుట్‌!

31 Dec, 2020 11:24 IST|Sakshi

సిడ్నీ: బాక్సింగ్‌ డే టెస్టు సమయంలో గాయపడిన టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జట్టును వీడి స్వదేశానికి పయనం కానున్నాడు. కాగా రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఉమేశ్‌ గాయంతో విలవిల్లాడిన విషయం విదితమే. కాలి(పిక్కల్లో) నొప్పి కారణంగా ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లోనే మైదానాన్ని వీడాడు. బీసీసీఐ వైద్య బృందం అతడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆస్పత్రికి తరలించింది. ఇక అతడి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌  8 వ ఓవర్‌ను పూర్తిచేశాడు. కాగా ఉమేశ్‌ స్థానంలో యార్కర్‌ కింగ్‌ టి. నటరాజన్‌ను సిడ్నీ టెస్టులో ఆడించే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తమిళనాడు పేసర్‌ నటరాజన్ మెరుగ్గా రాణించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

అదే విధంగా టీ20 సిరీస్‌లో(3+2 వికెట్లు)నూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో శార్దూల్‌ ఠాకూర్‌ కంటే కూడా నటరాజన్‌ వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గుచుపుతున్నట్లు విశస్వనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటికే బాక్సింగ్‌ డే టెస్టుతో సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మహ్మద్‌ సిరాజ్, శుభ్‌మన్‌ గిల్‌ దిగ్గజాల చేత ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.‌‌ కాగా ఆసీస్‌ టూర్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్‌ యాదవ్‌ మొత్తంగా 39.4 ఓవర్లు బౌలింగ్‌ చేసి నాలుగు వికెట్లు తీశాడు. (చదవండి:'క్వారంటైన్‌ తర్వాత మరింత యంగ్‌ అయ్యావు')

గాయపడటానికి ముందు ఆస్ట్రేలియా ఓపెనర్‌ జో బర్న్స్‌ను అతడు పెవిలియన్‌కు చేర్చాడు. ఇక ఇప్పటికే మహ్మద్‌ షమీ బోర్డర్‌- గవాస్కర్‌ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రెండో టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆసీస్‌కు స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చేరికతో కాస్త ఊరట లభించింది. సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది.

మరిన్ని వార్తలు