County Cricket: ఇంత దారుణమా.. ఏ లెక్కన ఔటిచ్చారో చెప్పండి‌!

26 Apr, 2022 12:03 IST|Sakshi

ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో ఫీల్డ్‌ అంపైర్లు అనవసర తప్పిదాలు ఎక్కువగా చేస్తున్నారు. ఫలితంగా బ్యాట్స్‌మెన్‌ మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా కౌంటీ క్రికెట్‌లో అంపైర్‌ చెత్త నిర్ణయానికి బ్యాట్స్‌మన్‌ బలవ్వాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. కెంట్‌, హంప్‌షైర్‌ మధ్య ఆదివారం కౌంటీ మ్యాచ్‌ జరిగింది. కెంట్‌ బ్యాటర్‌ జోర్డాన్‌ కాక్స్‌ క్రీజులో ఉన్నాడు. హంప్‌షైర్‌ బౌలర్‌ ఫెలిక్స్‌ ఆర్గన్‌ వేసిన బంతిని అడ్డుకునే క్రమంలో జోర్డాన్‌ తన కాలిని ఆఫ్‌స్టంప్‌ అవతల అడ్డుపెట్టాడు. అతని కాలికి తగిలి బంతి గాల్లోకి లేచి ఫీల్డర్‌ చేతిలో పడింది.

అది క్లియర్‌ ఔట్‌ కాదని తెలుసు.. అయినా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగానే ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చేశాడు. పోని ఎల్బీ అనుకుందామంటే అసలు బంతి ఆఫ్‌స్టంప్‌కు చాలా దూరంగా వెళుతుంది. మరి ఏ లెక్కన అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడనేది అర్థం కాని విషయం. అంపైర్‌ నిర్ణయంతో షాక్‌ తిన్న జోర్డాన్‌ కాక్స్‌ కొన్ని సెకన్ల పాటు క్రీజులో అలాగే నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో​ వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫీల్డ్‌ అంపైర్‌ను ట్రోల్‌ చేశారు. ''చెత్త అంపైరింగ్‌.. మరి ఇంత దారుణమా.. అసలు ఇది ఏ లెక్కన ఔట్‌ అనేది అంపైర్‌ చెప్పాల్సిందే..'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ఫ్యాన్స్‌తో పాటు ఇంగ్లండ్‌ క్రికెటర్లు బెన్‌ స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌లు తప్పుడు నిర్ణయం ఇచ్చిన అంపైర్‌కు తమదైన శైలిలో చురకలంటించారు. ఇక ఐస్‌లాండ్‌ క్రికెట్‌ కూడా తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు.'' ఐపీఎల్‌లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అంపైర్లను మార్చాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ తప్పిదాలు కౌంటీ క్రికెట్‌లో జరుగుతున్నాయి. మా దగ్గర ట్రెయిన్‌ అయిన మంచి అంపైర్లను ఐపీఎల్‌ కంటే ముందుగా కౌంటీలకు పంపించాలి'' అంటూ పేర్కొంది.

మొన్నటికి మొన్న ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో ఒక నో బాల్‌ వ్యవహారం ఎంతటి హైడ్రామా సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత క్లియర్‌గా నోబాల్‌ అని తెలుస్తున్నప్పటికి ఫీల్డ్‌ అంపైర్‌ నో బాల్‌ ఇవ్వకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పిలవడం సిల్లీగా అనిపించినా అతని కోపాన్ని చూపించింది. ఆ తర్వాత అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన తెలిపిన పంత్‌, అసిస్టెంట్‌ కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రే, శార్దూల్‌ ఠాకూర్‌లపై ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ కఠిన చర్యలు తీసుకుంది. అంతకముందు ఆర్సీబీ సీనియర్‌ ఆటగాడు కోహ్లి ఎల్బీ విషయంలోనూ థర్డ్‌ అంపైర్‌ నిర్లక్ష్యం ప్రదర్శించడం విమర్శలకు దారి తీసింది.

చదవండి: Sakshi Dhoni: జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య

భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు