అంపైర్స్‌ కాల్‌ మార్గదర్శకాలను పునఃపరిశీలించాలి: కోహ్లి

22 Mar, 2021 21:32 IST|Sakshi

పూణే: డెసిషన్‌ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్‌)లో అంపైర్స్‌ కాల్‌ విధానం గందరగోళం సృష్టిస్తోందని, దాని మార్గదర్శకాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అలాగే బాల్‌ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకినట్లు స్పష్టమైతే, ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించాలని ఆయన సూచించాడు. త్వరలో ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీలు జరగబోతున్న నేపథ్యంలో  మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. కాగా, అంపైర్స్‌ కాల్‌ నిబంధనను పునః పరిశీలించాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఐసీసీకి సూచించిన విషయం తెలిసిందే. 

భారత్-ఇంగ్లండ్‌ జట్ల మధ్య మంగళవారం జరుగనున్న తొలి వన్డే నేపథ్యంలో ఈరోజు జరిగిన వ‌ర్చువ‌ల్ ప్రెస్ మీట్‌లో కోహ్లి మాట్లాడుతూ.. అంపైర్స్‌ కాల్‌ విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. డీఆర్‌ఎస్‌ లేనప్పుడు కూడా తాను సుదీర్ఘ క్రికెట్‌ ఆడానని, బ్యాట్స్‌మెన్‌కు ఇష్టమున్నా లేకున్నా అంపైర్‌ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నాడు. అంపైర్స్‌ కాల్‌ గంధరగోళం సృష్టిస్తోందని, దాన్ని సవరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యనించాడు. బ్యాట్స్‌మన్‌ బౌల్డ్‌ అయిన సందర్భంలో బంతి 50 శాతానికి పైగా వికెట్లను తాకిందా అని చూడరు కదా అని ప్రశ్నించాడు. బంతి ఎంత మేర వికెట్లను తాకిందన్న నిర్ణయం తికమక పెడుతోందని వెల్లడించాడు. కాగా, అంపైర్స్‌ కాల్‌ను సవాల్‌ చేస్తే బాల్‌ ట్రాకింగ్‌లో బంతి 50 శాతం వికెట్లను తాకితేనే అవుట్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు