Pele Career Records: అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం

30 Dec, 2022 17:04 IST|Sakshi

ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్‌ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్‌ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్‌బాల్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజ‌యాల్ని అందించాడు పీలే. సుదీర్ఘ కెరీర్‌లో పీలే సాధించిన కొన్ని రికార్డులు ఇవి...

బ్రెజిల్‌కు మూడు వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ను పీలే అందించాడు. 1958, 1962, 1970 మూడు సార్లు బ్రెజిల్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంతో పీలే కీల‌క పాత్ర పోషించాడు. అత్య‌ధిక సార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకున్న ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా రికార్డులెక్కాడు. 

► 1958 వ‌ర‌ల్డ్ క‌ప్ తో పీలే ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభ‌మైంది. అప్ప‌టికీ పీలే వ‌య‌సు 17 ఏళ్లు మాత్ర‌మే. వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడిన అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా పీలే రికార్డ్ సృష్టించాడు.

► 1958 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో పీలే ఫ్రాన్స్‌పై హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. కేవ‌లం 23 మూడు నిమిషాల వ్య‌వ‌ధిలోనే మూడు గోల్స్ చేసి బ్రెజిల్‌ను విజేత‌గా నిలిపాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో హ్యాట్రిక్ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్ అత‌డే కావ‌డం గ‌మ‌నార్హం.

► వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గోల్ చేసిన 18 కంటే త‌క్కువ వ‌య‌సున్న ఏకైక‌ ఆట‌గాడు కూడా పీలే కావ‌డం విశేషం.

► బ్రెజిలియ‌న్ క్ల‌బ్ సాంటోస్ త‌ర‌ఫున అత్య‌ధిక గోల్స్ చేసిన ఆట‌గాడు పీలే కావ‌డం గ‌మ‌నార్హం. 659 మ్యాచ్‌ల‌లో 643 గోల్స్ చేశాడు పీలే. కెరీర్ మొత్తంగా 1363 మ్యాచ్‌లు ఆడిన పీలే 1283 గోల్స్ చేశాడు.

► బ్రెజిల్ త‌ర‌ఫున 92 మ్యాచ్‌ల‌లో 77 గోల్స్ చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన పీలే 12 గోల్స్ చేశాడు.

► పీలే బ్రెజిల్ త‌రుఫున ఎన్నో అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పీలే ఒలింపిక్స్‌లో మాత్రం ఒక్క‌సారి కూడా బ‌రిలో దిగ‌లేదు.

► ఒక ఏడాదిలో అత్య‌ధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పీలేనే. 1959వ ఏడాదిలో పీలే 127 గోల్స్ చేశాడు.

► పీలే కెరీర్‌లో మొత్తం 92 రెండు సార్లు హ్యాట్రిక్ గోల్స్ చేశాడు.

మరిన్ని వార్తలు