సిక్సర్లతో డబుల్‌ సెంచరీ, ఫోర్లతో సెంచరీ.. మొత్తంగా క్వాడ్రాపుల్‌ సెంచరీ చేసిన యంగ్‌ క్రికెటర్‌

20 Dec, 2022 18:48 IST|Sakshi

బౌండరీల మోత, సిక్సర్ల సునామీ

Tanmay Singh: 13 ఏళ్ల కుర్రాడు తన్మయ్‌ సింగ్‌.. గ్రేటర్‌ నోయిడా వేదికగా జరుగుతున్న అండర్‌-14 క్లబ్‌ క్రికెట్‌ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు. ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో దేవ్‌రాజ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తన్మయ్‌.. 132 బంతుల్లో 30 ఫోర్లు, 38 సిక్సర్ల సాయంతో క్వాడ్రాపుల్‌ సెంచరీ (401) సాధించాడు.

ఈ ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ, భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌లను గుర్తు చేసిన తన్మయ్‌.. భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆడేం‍దుకు గట్టి పునాది వేసుకున్నాడు.

సచిన్‌ (326), కాంబ్లీ (349) అండర్‌-14 క్రికెట్‌ ఆడే సమయంలో శారదాశ్రమ్‌ విద్యామందిర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రికార్డు స్థాయిలో 646 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. హ్యారీస్‌ షీల్డ్‌ టోర్నీలో సర్ఫరాజ్‌ ఖాన్‌ (439), పృథ్వీ షా (546) రికార్డు స్థాయి స్కోర్లు నమోదు చేశారు.

ఈ భారీ ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ నలుగురు ముంబైకర్‌లు వెలుగులోకి వచ్చి ఆ తర్వాతి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలను దక్కించుకున్నారు. తన్మయ్‌ కూడా చిన్న వయసులోనే భారీ ఇన్నింగ్స్‌ ఆడి సచిన్‌, కాంబ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్‌, పృథ్వీ షా తరహాలో టీమిండియాకు ఆడే అవకాశాలను దక్కించుకుంటాడని ఈ ఇన్నింగ్స్‌ గురిం‍చి తెలిసిన అభిమానులు చర్చించుకుంటున్నారు.

కాగా, తన్మయ్‌తో పాటు రుద్ర బిదురి (135 నాటౌట్‌; 5 ఫోర్లు, 15 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో వారు ప్రాతినిధ్యం వహించిన దేవ్‌రాజ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ 656 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఛేదనలో ర్యాన్‌ అకాడమీ 193 పరుగులకే చాపచుట్టేయడంతో దేవ్‌రాజ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ 463 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తన్మయ్‌ సాధించిన 401 పరుగుల్లో 226 పరుగులు సిక్సర్ల రూపంలో, 120 పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. తన్మయ్‌ భారీ ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం​ సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ కుర్రాడు టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు