Under-19 Womens T20 World Cup 2023: ఫైనల్‌ సమరానికి సిద్ధం

29 Jan, 2023 05:38 IST|Sakshi

నేడు మహిళల అండర్‌–19 వరల్డ్‌ కప్‌ తుది పోరు

ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిల ఢీ  

పొచెఫ్‌స్ట్రూమ్‌: మహిళల క్రికెట్‌లో ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత జట్టు ఆ ఘనతకు అడుగు దూరంలో ఉంది. సీనియర్‌ అమ్మాయిల జట్టు మూడు ప్రపంచకప్‌ (రెండు వన్డే, ఒకటి టి20) ఫైనల్లో ఆడినా... రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ జూనియర్‌ జట్టు ఫైనల్‌ విజయంతో వస్తే... భారత మహిళల క్రికెట్‌ ప్రగతి మరో దశకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు ఆదివారం ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది.

శనివారమే పుట్టినరోజు జరుపుకున్న షఫాలీకి వున్న అంతర్జాతీయ అనుభవం, జట్టు ఈ టోర్నీలో కనబరిచిన ప్రదర్శనను బట్టి చూస్తే భారతే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.  పైగా రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఆడిన షఫాలీ తన నైపుణ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చితే ఆమె ఖాతాలో అరుదైన రికార్డు చేరుతుంది. సెమీఫైనల్లో షఫాలీ సేన న్యూజిలాండ్‌పై అలవోక విజయం సాధించింది. మొదట బౌలర్లు, తర్వాత బ్యాటర్లు కివీస్‌ అమ్మాయిలపై ఆధిపత్యం చలాయించారు. ఫైనల్లోనూ ఇదే పట్టుదల కనబరిస్తే  ప్రపంచకప్‌ చేతికందుతుంది. మరో వైపు సెమీస్‌లో హోరాహోరీ సమరంలో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించడంతో ఇంగ్లండ్‌ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత జట్టుకు తగిన పోటీ ఇవ్వగల సత్తా ఇంగ్లండ్‌కు ఉంది.    

నేడు హాకీ ప్రపంచకప్‌ ఫైనల్‌
► జర్మనీ X బెల్జియం
► రా.గం. 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం   
► సా.గం.5.15 నుంచి ‘ఫ్యాన్‌కోడ్‌’ యాప్‌లో ప్రసారం 

మరిన్ని వార్తలు