Under 23 Athletics Championships: జ్యోతిక పసిడి పరుగు.. రజతం గెలిచిన యశ్వంత్‌

29 Sep, 2021 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ అండర్‌–23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకాన్ని సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన జ్యోతికశ్రీ 400 మీటర్ల దూరాన్ని 53.05 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో వైజాగ్‌కు చెందిన లావేటి యశ్వంత్‌ రజతం గెల్చుకున్నాడు.

కాగా యశ్వంత్‌ 14.25 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నక్కా రాజేశ్‌ 48.94 సెకన్లలో గమ్యానికి చేరి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య కాంస్య పతకం సొంతం చేసుకుంది. నిత్య 11.90 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 200 మీటర్ల విభాగంలో మాయావతి ఫైనల్‌కు చేరింది.

చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్‌ కార్తిక్‌

మరిన్ని వార్తలు