ఒక బ్యాడ్‌ గేమ్‌తో కెప్టెన్సీ తీసేస్తారా?

9 Nov, 2020 21:31 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది మే నెలలో పాకిస్తాన్‌ టెస్టు కెప్టెన్‌గా నియమించబడ్డ అజహర్‌ అలీ స్థానంలో అజామ్‌ను కెప్టెన్‌గా చేయాలని పీసీబీ భావిస్తోంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌గా ఉన్న అజామ్‌నే టెస్టులకు కూడా సారథిగా నియమించడమే సరైనదిగా పాక్‌ బోర్డు యోచిస్తోంది.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్‌ కోల్పోవడంతో అజహర్‌ అలీకి ఉద్వాసన పలికారు. తొలి టెస్టులో అజహర్‌ అలీ ఫీల్డింగ్‌ తప్పిదం కారణంగానే ఆ మ్యాచ్‌ పోయిందని పీసీబీకి అందిన రిపోర్ట్‌. దాంతో టెస్టు కెప్టెన్‌ పదవిని అజహర్‌ అలీ కోల్పోయాడు.

దీనిపై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. ఇది చాలా అన్యాయమని అక్తర్‌ విమర్శించాడు. ఒక బ్యాడ్‌ గేమ్‌తో కెప్టెన్సీని మార్చేస్తారా అంటూ పీసీబీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ‘ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజహర్‌ అలీ తప్పుచేశాడు.. దాన్ని అంగీకరిస్తాను. ఆ ఫీల్డింగ్‌ చర్యతో అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ తప్పు కారణంగా అతన్ని కెప్టెన్‌గా తీసేయడం అన్యాయం. కేవలం ఒక మ్యాచ్‌ కారణంగా అజహర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా?, నేనే కచ్చితంగా చెప్పగలను.. రాబోవు మ్యాచ్‌ల్లో అజహర్‌ వంద శాతం ప్రదర్శన ఇవ్వగలడు. ఈ తరహా చర్యలు ఆటగాళ్ల ఆటపై ప్రభావం చూపుతాయి’ అని తన యూట్యూబ్‌ చానల్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది టెస్టులకు కెప్టెన్‌గా చేసిన అజహర్‌ అలీ.. రెండు మ్యాచ్‌లను గెలిచి, నాలుగు మ్యాచ్‌లను కోల్పోయాడు.

మరిన్ని వార్తలు