ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు

4 Jun, 2021 17:17 IST|Sakshi

లండన్: లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే అద్భుతమైన ద్విశతకాన్ని సాధించి, రాత్రికి రాత్రే హీరోగా మారిపోయిన న్యూజిలాండ్‌ ఆటగాడు డెవాన్ కాన్వే గత జీవితం ఏమంత సాఫీగా సాగలేదన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కాన్వే.. ట్రైనింగ్ కోసం ఇల్లు, కారు సహా చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. పుట్టింది దక్షిణాఫ్రికాలోనే అయినా.. క్రికెట్‌ కోసం దేశాన్ని వీడి న్యూజిలాండ్‌ బాట పట్టాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్‌బై చెప్పాడు. 

అక్కడి నుంచి స్నేహితుల సహకారంతో వెల్లింగ్టన్‌కు చేరిన కాన్వే.. అక్కడే తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు. విక్టోరియా క్రికెట్ క్లబ్ కోచ్‌గా, బ్యాట్స్‌మెన్‌గా డ్యుయల్‌ రోల్ పోషిస్తూ, అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కాన్వే.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతి గడించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే డబుల్‌ సెంచరీ సాధించిన అతను.. అండర్సన్, బ్రాడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని నిలబడి క్రికెట్‌ మక్కాలో చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కాన్వే.. 347 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌తో 200 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూసి మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే మరో స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్‌ సెంచరీ), టెస్ట్‌ క్రికెట్‌లో 200 పరుగులు సాధించాడు.
చదవండి: ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు..

మరిన్ని వార్తలు