Unmukt Chand: ఉన్ముక్త్‌ చంద్‌ రిటైర్మెంట్‌.. పెప్సీ యాడ్‌ వైరల్‌ 

14 Aug, 2021 14:57 IST|Sakshi

ఢిల్లీ: భారత​ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ భారత్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 28 ఏళ్ల వయసులోనే ఉన్ముక్త్‌ చంద్‌ గుడ్‌బై చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. కాగా విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే  భారత్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఉన్ముక్త్‌ బీసీసీఐకి రాసిన లేఖలో తెలిపాడు. భారత క్రికెట్‌లో అవకాశాలు లేక యునైటెడ్‌ స్టేట్స్‌ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(ఎమ్మెల్సీ)తో మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ఉన్ముక్త్‌ చంద్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో  అతని పాత పెప్సీ యాడ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారింది. ఆ యాడ్‌లో ఉన్ముక్త్‌ చంద్‌తో కలిసి  ఎంఎస్‌  ధోని, విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనాలు ఉండడం విశేషం. ఇక యాడ్‌ విషయానికి వస్తే.. అండర్‌ 19 కెప్టెన్‌గా ఉన్న ఉన్ముక్త్‌ తన ప్రాక్టీస్‌ ముగించుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌ వస్తుండగా.. అక్కడే సీనియర్‌ ఆటగాళ్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ చూస్తాడు. డోర్‌ ఓపెన్‌ చేయగానే ఎదురుగు ఫ్రిజ్‌లో పెప్సీ కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్లిన అతను పెప్సీ తాగుతుంటాడు. అప్పుడే ధోని వచ్చి మా పర్మిషన్‌ లేకుండా ఎలా వచ్చావు.. అని అడుగుతాడు. అప్పుడే సీన్‌లోకి కోహ్లి, రైనాలు కూడా ఎంటర్‌ అవుతారు. ఆ తర్వాత అందరు కలిసి ఉన్ముక్త్‌ను ఆట పట్టిస్తారు. చివరికి అందరు కలిసి పెప్సీ యాడ్‌కు ముగింపు పలుకుతారు. 

ఇక 2012 అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్‌ చంద్‌ (111 పరుగులు నాటౌట్‌) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్‌ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఈ మధ్య కాలంలో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని 2013 చాంపియన్స్‌ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఇండియా జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. స్వతహాగా మంచి టెక్నిక్‌తో షాట్లు ఆడే ఉన్ముక్త్‌  ఆ తర్వాత ఎందుకనో మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేక వెనుకబడిపోయాడు. ఇక ఉన్ముక్త్‌ చంద్‌ 65 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్‌లో 77 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన చంద్‌ 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్‌ చంద్‌ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు.

మరిన్ని వార్తలు