జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్‌’పోటు!

14 Aug, 2022 05:23 IST|Sakshi

సిన్సినాటి టోర్నీ నుంచి వైదొలిగిన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌

యూఎస్‌ ఓపెన్‌కూ అనుమానం

న్యూయార్క్‌: కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ జొకోవిచ్‌ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్‌ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ వేసుకోని జొకోవిచ్‌ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్‌ నుంచి వైదొలిగాడు.

వ్యాక్సిన్‌ విషయంలో జొకోవిచ్‌ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్‌ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్‌ చెబుతున్నా... వ్యాక్సిన్‌ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్‌ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో జొకోవిచ్‌ విజేతగా నిలిచి కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు