కోహ్లీ నాలుగేళ్ల సంపాదన ఒక్క రోజులో ఆర్జించాడు.. అదీ ఫేక్‌ ఫైట్‌ ద్వారా 

29 Jun, 2021 16:05 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా సారధి విరాట్ కోహ్లీ నాలుగేళ్ల సంపాదనను ఆ రిటైర్డ్‌ అమెరికన్‌ బాక్సర్‌ కేవలం ఒక్క రోజులో అర్జించాడు. ప్రపంచంలోనే అత్యధిక ధనార్జన కలిగిన క్రీడాకారుల్లో ఒకరైన కోహ్లీ.. పారితోషికాలు, ఎండార్స్‌మెంట్లు తదితర మార్గాల ద్వారా ఏడాదికి దాదాపు రూ. 196 కోట్ల రూపాయలు సంపాదిస్తుంటాడు. దీన్ని చూసే చాలా మంది ముక్కున వేలేసుకుంటుంటారు. అయితే కోహ్లీ నాలుగేళ్ల సంపాదనను కేవలం ఒక్క రోజులోనే కొల్లగొట్టాడు అమెరికా దిగ్గజ బాక్సర్‌ ఫ్లాయిడ్‌ మెవెదర్‌. అది కూడా ఓ ఫేక్ ఫైట్ చేసి ఈ మొత్తం అర్జించాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. జూన్ మొదటి వారంలో లోగన్ పాల్ అనే యూట్యూబర్‌తో బాక్సింగ్ రింగ్‌లో తలపడిన మెవెదర్.. ఆ మ్యాచ్ ద్వారా 100 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 742 కోట్లు) సంపాదించినట్లు చెప్పాడు. అదేదో ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో సంపాదించిందనుకుంటే పొరపడట్టే. ఈ భారీ మొత్తాన్ని మెవెదర్‌ ఓ ఫేక్ ఫైట్ ద్వారా సంపాదించానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సరదాగా కోసం బౌట్‌లోకి అడుగుపెడితే.. అపార సంపద తన తలుపు తట్టిందని తెలిపాడు.

ప్రొఫెషనల్ బాక్సర్ అయిన మెవెదర్‌ ఆరు రౌండ్ల పాటు సాగిన ఈ ఫైట్‌లో ప్రత్యర్ధిపై ఒక్క పంచ్‌ కూడా విసరకపోవడం విశేషం. ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రత్యర్థిపై చేయెత్తకపోవడంతో ఈ మ్యాచ్‌పై చాలా సందేహాలు, విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌ 6న జరిగిన ఈ బౌట్‌లో మెవెదర్‌ ఓటమిపాలైనప్పటికీ.. అతని ఖాతాలో 742 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. దీంత అతని ఆస్తుల విలువ రూ. 1.2 బిలియన్లకు చేరుకుంది.

ఇదిలా ఉంటే, ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ చరిత్రలో అజేయుడిగా ఉన్న మెవెదర్ తన కెరీర్‌ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అతనాడిన 50 మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధిపై అతనిదే పైచేయి. హోలీఫీల్డ్‌ లాంటి దిగ్గజ బాక్సర్లను సైతం మట్టికరిపించిన ఆయన.. బాక్సింగ్‌ చరిత్రలో మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యాడు. ఈ క్రమంలో పేరు ప్రఖ్యాతలతో పాటు భారీ మొత్తంలో డబ్బును సంపాదించాడు.

చివరకు 2017లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైర్ అయ్యాడు. క్రీడాకారుల్లో అపర కుబేరుడిగా పేరొందిన మెవెదర్‌.. చాలా లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తాడు. అతని వద్ద ఖరీదైన కార్లు, వాచీలు, జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయి. బుగాటి, లంబొర్గిని, రోల్స్ రాయస్ వంటి కార్లు అతడి గ్యారేజీలో కలెక్షన్లుగా పడి ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ క్రీడాకారుని వద్ద లేని వరల్డ్‌ క్లాస్‌ జెట్‌ ఫ్లైట్‌ని అతను సొంతం చేసుకున్నాడు. దాని ఖరీదు రూ. 350 కోట్లకు పైమాటే. 
చదవండి: ఐపీఎల్‌ అసలు క్రికెట్టే కాదు.. ప్రముఖ వ్యాఖ్యాత సంచలన వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు