Novak Djokovic: రికార్డుల దిశగా జొకోవిచ్‌ అడుగులు

10 Sep, 2021 05:27 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో జొకోవిచ్‌

ప్లిస్కోవాకు చెక్‌ పెట్టిన సకారి

ఎదురు లేకుండా సాగుతున్న జొకోవిచ్‌ అడుగులు రికార్డుల దిశగా పడుతున్నాయి. ఈ సీజన్‌ ఆఖరి గ్రాండ్‌స్లామ్‌లో నంబర్‌వన్‌ సెర్బియన్‌ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక రెండంటే రెండే మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్స్‌) గెలిస్తే జొకో క్యాలెండర్‌ స్లామ్‌తో పాటు 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఆల్‌టైమ్‌ గ్రేటెస్టు దిగ్గజాలు ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), నాదల్‌ (స్పెయిన్‌)లను అధిగమిస్తాడు.

న్యూయార్క్‌: ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌లను గెలిచిన సెర్బియన్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తాజాగా యూఎస్‌ ఓపెన్‌ గెలిచే పనిలో పడ్డాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ టాప్‌ సీడ్‌ ప్లేయర్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 5–7, 6–2, 6–2, 6–3తో ఆరో సీడ్‌ మటియో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. మిగతా క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6–3, 6–0, 4–6, 7–5తో నెదర్లాండ్స్‌కు చెందిన బొటిక్‌ వాన్‌ డె జండ్‌ష్చల్ప్‌పై గెలుపొందగా, నాలు గో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7–6 (8/6), 6–3, 6–4తో లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా)పై నెగ్గాడు. మహిళల క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు 4–6, 4–6తో మరియా సకారి (గ్రీస్‌) చేతిలో చుక్కెదురైంది.

తొలి సెట్‌ కోల్పోగానే...
జొకోవిచ్, బెరెటిని మధ్య జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌ హోరాహోరీగా మొదలైంది. పది గేమ్‌ల దాకా ఇద్దరు సరీ్వస్‌ను నిలబెట్టుకోవడంతో 5–5తో సమంగా నిలిచారు. సెర్బియన్‌ సర్వీస్‌ చేసిన 11వ గేమ్‌ను బ్రేక్‌ చేయడం ద్వారా బెరెటిని 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. తదుపరి గేమ్‌లో తన సరీ్వస్‌ను నిలబెట్టుకోవడంతో తొలిసెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ సెట్‌ కోల్పోగానే జొకో జాగ్రత్త పడ్డాడు. తర్వాత వరుసగా మూడు సెట్లను అవలీలగానే చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 12 ఏస్‌లు సంధించిన సెర్బియన్‌ స్టార్‌ 4 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌ వద్ద 19 పాయింట్లు సాధించిన జొకోవిచ్‌ 44 విన్నర్లు కొట్టాడు. 28 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 5 బ్రేక్‌ పాయింట్లు సాధించి ప్రత్యరి్థపై పైచేయి సాధించాడు.

మరోవైపు ఇటలీ స్టార్‌ బెరెటిని... జొకో కంటే అత్యధికంగా 17 ఏస్‌లు సంధించినప్పటికీ ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. 42 విన్నర్లు కొట్టాడు. ఇప్పటివరకు మూడు సార్లు (2011, 2015, 2018) యూఎస్‌ చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌ ఇక్కడ సెమీస్‌ చేరుకోవడం ఇది 12వ సారి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో సెర్బియన్‌ స్టార్‌... జర్మనీకి చెందిన నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఈ సీజన్‌ వింబుల్డన్‌ రన్నరప్‌ కరోలినా ప్లిస్కోవా 4–6, 4–6తో వరుస సెట్లలో సకారి ధాటికి చేతులెత్తేసింది. 2016లో యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ను కేవలం గంటా 22 నిమిషాల్లోనే సకారి ఇంటిదారి పట్టించింది. 2015 నుంచి యూఎస్‌ ఓపెన్‌ ఆడుతున్న  గ్రీస్‌ ప్లేయర్‌ సకారి తన కెరీర్‌లో తొలిసారి సెమీస్‌ చేరింది.  

సెమీస్‌లో ఎవరితో ఎవరు
జొకోవిచ్‌ (1) గీ జ్వెరెవ్‌ (4)
మెద్వెదెవ్‌ (2) గీ ఫెలిక్స్‌ అగర్‌ (12) 

మరిన్ని వార్తలు