US Open 2022: ‘నంబర్‌వన్‌’ సమరం

11 Sep, 2022 04:45 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో అల్‌కరాజ్, కాస్పర్‌ రూడ్‌

టైటిల్‌ సాధిస్తే ‘టాప్‌’ ర్యాంక్‌ కూడా సొంతం

న్యూయార్క్‌: పురుషుల టెన్నిస్‌ చరిత్రలో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో ఇద్దరు క్రీడాకారులు ఏకకాలంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), ఏడో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో గెలిచిన ప్లేయర్‌కు తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ లభిస్తుంది.

భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు ఈ ఫైనల్‌ మొదలవుతుంది. సెమీఫైనల్స్‌లో ఏడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ 7–6 (7/5), 6–2, 5–7, 7–2తో 27వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)పై... మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ 6–7 (6/8), 6–3, 6–1, 6–7 (5/7), 6–3తో 22వ సీడ్‌ టియాఫో (అమెరికా)పై గెలిచారు. 23 ఏళ్ల కాస్పర్‌ రూడ్‌ తన కెరీర్‌లో రెండో సారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరగా... 19 ఏళ్ల అల్‌కరాజ్‌ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది కాస్పర్‌ రూడ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచాడు.  

పక్కా ప్రణాళికతో...
నాన్న క్రిస్టియాన్‌ శిక్షణలో రాటుదేలిన కాస్పర్‌ పక్కా ప్రణాళికతో ఆడి రష్యా ఆజానుబాహుడు ఖచనోవ్‌ ఆట కట్టించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్‌ శక్తివంతమైన సర్వీస్‌లను రిటర్న్‌ చేయడానికి కాస్పర్‌ బేస్‌లైన్‌ వెనుక నిల్చోని రిటర్న్‌ చేశాక సుదీర్ఘ ర్యాలీలు ఆడాడు. తొలి సెట్‌ టైబ్రేక్‌లో కాస్పర్, ఖచనోవ్‌ మధ్య 12వ పాయింట్‌ కోసం ఏకంగా 55 షాట్‌ల ర్యాలీ జరగడం విశేషం. మూడు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కాస్పర్‌ పది ఏస్‌లు సంధించాడు. నెట్‌ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. 53 విన్నర్స్‌ కొట్టిన కాస్పర్‌ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. ఖచనోవ్‌ 41 అనవసర తప్పిదాలు చేశాడు.

వరుసగా మూడో మ్యాచ్‌లో...
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అల్‌కరాజ్‌ ఈ టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఐదు సెట్‌ల పోరాటంలో విజయాన్ని దక్కించుకున్నాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 59 విన్నర్స్‌ కొట్టిన అల్‌కరాజ్‌ నెట్‌ వద్దకు 42 సార్లు దూసుకొచ్చి 32 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు టియాఫో 15 ఏస్‌లు సంధించి ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు.  

7: ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో వరుసగా మూడు ఐదు సెట్‌ల మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌ చేరిన ఏడో ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు. గతంలో అగస్సీ (అమెరికా; 2005 యూఎస్‌ ఓపెన్‌), ఎడ్బర్గ్‌ (స్వీడన్‌; 1992 యూఎస్‌ ఓపెన్‌), బన్‌గెర్ట్‌ (జర్మనీ; 1967 వింబుల్డన్‌), టోనీ రోచ్‌ (ఆస్ట్రేలియా; 1967 ఫ్రెంచ్‌ ఓపెన్‌), రాయ్‌ ఎమర్సన్‌ (ఆస్ట్రేలియా; 1962 ఫ్రెంచ్‌ ఓపెన్‌), అలెక్స్‌ ఒల్మెడో (పెరూ/అమెరికా; 1959 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) ఈ ఘనత సాధించారు.

రాజీవ్‌–సాలిస్‌బరీ జోడీకి డబుల్స్‌ టైటిల్‌
పురుషుల డబుల్స్‌లో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్‌) జోడీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో రాజీవ్‌ రామ్‌–సాలిస్‌బరీ ద్వయం 7–6 (7/4), 7–5తో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జోడీపై గెలిచింది. వరుసగా 22వ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో ఆడిన రాజీవ్‌ 11 వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగాడు. వుడ్‌ఫర్డ్‌–వుడ్‌బ్రిడ్జ్‌ (ఆస్ట్రేలియా; 1995, 1996) ద్వయం తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో వరుసగా రెండేళ్లు డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్‌–సాలిస్‌బరీ ద్వయం గుర్తింపు పొందింది.

>
మరిన్ని వార్తలు