US Open 2021: లేలా మరో సంచలనం

7 Sep, 2021 10:11 IST|Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో కెనడా టీనేజర్‌ లేలా ఫెర్నాండెజ్‌ మరో సంచలనం సృష్టించింది. మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నయోమి ఒసాకాను ఇంటిముఖం పట్టించిన 19 ఏళ్ల ఈ కెనడా అమ్మాయి... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 2016 చాంపియన్, మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, 16వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ)పై విజయం సాధించింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లేలా 4–6, 7–6 (7/5), 6–2తో కెర్బన్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

తొలి సెట్‌ కోల్పోయి రెండో సెట్‌లో 2–4తో వెనుకబడ్డ లేలా ఎనిమిదో గేమ్‌లో కెర్బర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించి రెండో సెట్‌ను దక్కించుకుంది. అదే జోరులో నిర్ణాయక మూడో సెట్‌లోనూ దూకుడుగా కెర్బర్‌ ఆట కట్టించింది. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 7–6 (7/4)తో మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, తొమ్మిదో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌)పై, రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6–4, 6–1తో ఎలైజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.  

అల్కారజ్‌ జోరు 
పురుషుల సింగిల్స్‌లో 18 ఏళ్ల కార్లోస్‌ అల్కారజ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్‌లో మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఐదు సెట్‌లలో ఓడించిన అల్కారజ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనూ ఐదు సెట్‌లలో గెలిచాడు. పీటర్‌ గొజోవిక్‌ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో అల్కారజ్‌ 5–7, 6–1, 5–7, 6–2, 6–0తో నెగ్గాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 6–3, 6–4, 6–3తో ఇవాన్స్‌ (బ్రిటన్‌)పై, 12వ సీడ్‌ ఫీలిక్స్‌ అగుర్‌ అలియాసిమ్‌ (కెనడా) 4–6, 6–2, 7–6 (8/6), 6–4తో టియాఫో (అమెరికా)పై, జాండ్‌షల్ప్‌ (నెదర్లాండ్స్‌) 6–3, 6–4, 5–7, 5–7, 6–1తో 11వ సీడ్‌ ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. 
చదవండి: IND Vs ENG 4th Test Day 5:50 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా ఘన విజయం

మరిన్ని వార్తలు