ప్లిస్కోవా శుభారంభం

1 Sep, 2020 03:19 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ ప్రారంభం

న్యూయార్క్‌: ఒకవైపు కరోనా వైరస్‌ భయం... మరోవైపు పలువురు టాప్‌ స్టార్లు గైర్హాజరు... ఇంకోవైపు కఠినమైన ఆంక్షలు... ప్రేక్షకులకు లేని ప్రవేశం... ఖాళీ ఖాళీగా స్టాండ్స్‌... ఎలాగైతేనేం సోమవారం యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు తెర లేచింది. మొదటి రోజు మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)... 2016 చాంపియన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) అలవోక విజయాలతో శుభారంభం చేసి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.

తొలి రౌండ్‌లో 2016 రన్నరప్‌ ప్లిస్కోవా 6–4, 6–0తో అనెహెలినా కలినినా (ఉక్రెయిన్‌)పై 63 నిమిషాల్లో గెలుపొందగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ 6–4, 6–4తో 88 నిమిషాల్లో ఐలా టొమ్లియానోవిచ్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. కలినినాతో జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా ఏడు ఏస్‌లు సంధించి, 16 అనవసర తప్పిదాలు చేసింది. టొమ్లియానోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్‌ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయినా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో 27వ సీడ్‌ బొర్నా చోరిచ్‌ (క్రొయేషియా) 7–5, 6–3, 6–1తో అందుఆర్‌ (స్పెయిన్‌)పై నెగ్గగా... 18వ సీడ్‌ లాజోవిచ్‌ (సెర్బియా) 1–6, 6–4, 4–6, 4–6తో జెరాసిమోవ్‌ (బెలారస్‌) చేతిలో ఓడిపోయాడు.

ప్రేక్షకులకు ప్రవేశం లేకపోవడంతో ఖాళీగా ఉన్న గ్యాలరీలు

మరిన్ని వార్తలు