US Open 2022 Serena Williams: వరల్డ్‌ నెంబర్‌-2కు షాక్‌.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ

1 Sep, 2022 14:58 IST|Sakshi

అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ యూఎస్‌ ఓపెన్‌లో తన జోరు ప్రదర్శిస్తోంది. యూఎస్‌ ఓపెన్‌ అనంతరం లాంగ్‌బ్రేక్‌ తీసుకోనున్న నేపథ్యంలో సెరెనా 24వ టైటిల్‌ సాధించేందుకు మరో అడుగు ముందుకేసింది. యూఎస్‌ ఓపెన్‌లో భాగంగా బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సెరెనా.. వరల్డ్‌ నెంబర్‌-2 అనేట్ కొంటావెయిట్‌ను 7-6(7-4), 2-6, 6-2తో చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్స్‌(మూడో రౌండ్‌)కు చేరుకుంది. 

ఐదేళ్ల నుంచి ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా నెగ్గని సెరెనా... వయసు మీద పడి, గాయాల కారణంగా మునుపటి లయ కోల్పోయింది. పలు టోర్నీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే వెనుదిరుగుతోంది.  ఈ  నేపథ్యంలో ప్రపంచ రెండో ర్యాంకర్ తో మ్యాచ్ కావడంతో యూఎస్ ఓపెన్ లోనూ సెరెనాకు రెండో రౌండ్‌ ఆఖరుదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ 41 ఏళ్ల వయసులో సెరెనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. 

మ్యాచ్‌లో తొలి సెట్ను టై బ్రేక్ లో గెలిచిన సెరెనా రెండో సెట్‌లో మాత్రం వెనుకంజ వేసింది. ఇక ఓటమి ఖాయమనుకున్న తరుణంలో నిర్ణాయాత్మక మూడో సెట్లో సెరెనా విజృంభించింది.  పాత సెరెనాను గుర్తుచేస్తూ  బ్యాక్‌, ఫోర్‌ హ్యాండ్‌, ఫార్వర్డ్‌ షాట్లతో దూకుడు ప్రదర్శించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ఇక మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడుతూ.. ''నేను సెరెనా విలియమ్స్‌. బాగా ఆడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కెరీర్లో ఎంతో సాధించా. నిజాయతీగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేదంతా బోనస్గా భావిస్తున్నా. కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. అలాగని  కోల్పోయేది కూడా ఏమీ లేదు. నా ఆట ఇంకా కొంచెం మిగిలి ఉందని అనుకుంటున్నా'' అంటూ పేర్కొంది.

చదవండి: Japan Open 2022: తొలి రౌండ్‌లో భారత్‌కు నిరాశజనక ఫలితాలు

మరిన్ని వార్తలు