గ్రేటెస్ట్‌ ఫెలిక్స్‌...

8 Aug, 2021 06:28 IST|Sakshi

ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన అమెరికా అథ్లెట్‌గా ఘనత

దిగ్గజం కార్ల్‌ లూయిస్‌ను అధిగమించిన ఫెలిక్స్‌

మహిళల 4 X 400 మీ. రిలే పరుగులో స్వర్ణం నెగ్గిన యూఎస్‌ఏ బృందం  

టోక్యో: అలీసన్‌ ఫెలిక్స్‌ సాధించింది. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన అమెరికన్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా ఫెలిక్స్‌ కొత్త చరిత్రను సృష్టించింది. శనివారం జరిగిన మహిళల 4 X 400 మీటర్ల రిలే పరుగులో అమెరికా బృందం స్వర్ణం గెలిచింది. సిడ్నీ మెక్‌లాఫ్లిన్, ఫెలిక్స్, దలీలా మొహమ్మద్, ఎతింగ్‌ మూలతో కూడిన అమెరికా టీమ్‌... రేసును 3 నిమిషాల 16.85 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఒలింపిక్స్‌లో 4్ఠ400మీ.లో అమెరికాకు ఇది వరుసగా ఏడో స్వర్ణం కావడం విశేషం.

1996 నుంచి ఇప్పటి వరకు ఈ విభాగంలో అమెరికాయే విజేతగా నిలుస్తుంది. శుక్రవారం జరిగిన 400 మీటర్ల పరుగులో ఫెలిక్స్‌ కాంస్యాన్ని నెగ్గడం ద్వారా... అప్పటి వరకు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అమెరికా తరఫున అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా ఉన్న కార్ల్‌ లూయిస్‌ (10 పతకాలు) సరసన చేరింది. అయితే తాజా స్వర్ణంతో తన ఖాతాలో 11వ పతకాన్ని చేర్చుకున్న ఫెలిక్స్‌ కార్ల్‌ లూయిస్‌ను వెనక్కి నెట్టింది. ఓవరాల్‌గా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో 12 పతకాలతో ఫిన్లాండ్‌కు చెందిన పావో నుర్మీ తొలి స్థానంలో ఉన్నాడు. పతకం తేడాతో 35 ఏళ్ల ఫెలిక్స్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికా తర్వాత 3 నిమిషాల 20.53 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్న పోలాండ్‌ జట్టు రజతం, 3 నిమిషాల 21.24 సెకన్లలో రేసును ముగించిన జమైకా జట్టు కాంస్యం గెల్చుకున్నాయి.  

పురుషుల విభాగంలోనూ అమెరికాదే హవా
పురుషుల 4 X 400 రిలే పరుగులోనూ అమెరికాకే స్వర్ణం దక్కింది. శనివారం జరిగిన ఫైనల్లో మైకేల్‌ చెర్రీ, బ్రైస్‌ డెడ్‌మోన్, రాయ్‌ బెంజమిన్, మైకేల్‌ నోర్మన్‌లతో కూడిన అమెరికా టీమ్‌ అందరికంటే ముందుగా 2 నిమిషాల 55.70 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో అమెరికాకు ఇది 18వ స్వర్ణం కావడం విశేషం. 2 నిమిషాల 57.18 సెకన్లలో రేసును ముగించిన నెదర్లాండ్స్‌ రజతాన్ని... 2 నిమిషాల 57.27 సెకన్లలో గమ్యాన్ని చేరిన బొట్స్‌వానా కాంస్యాన్ని సొంతం చేసుకున్నాయి.

సిఫాన్‌ సూపర్‌ రన్‌...
చివరి 200 మీటర్లలో తన పరుగులో వేగం పెంచిన నెదర్లాండ్స్‌ అథ్లెట్‌ సిఫాన్‌ హసన్‌ టోక్యో ఒలింపిక్స్‌లో మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల 10,000 మీటర్ల పరుగులో 29 నిమిషాల 55.32 సెకన్లలో గమ్యాన్ని చేరిన సిఫాన్‌ విజేతగా నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో ఆమెకు ఇది మూడో పతకం కావడం విశేషం. 5000 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన ఆమె... 1500 మీటర్ల పరుగులో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. కల్కిదాన్‌ గెజహెగ్నె (బహ్రెయిన్‌) రజతాన్ని సొంతం చేసుకుంది. 9800 మీటర్ల వరకు రేసును లీడ్‌ చేసిన లెటెసెన్‌బెట్‌ గిడీ (ఇథియోసియా) చివరి 200 మీటర్లలో ఆధిక్యాన్ని చేజార్చుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు