వన్డే ఫార్మాట్‌లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్‌, 450 పరుగుల తేడాతో విజయం

15 Aug, 2023 17:49 IST|Sakshi

ఐసీసీ అండర్‌-19 పురుషుల వరల్డ్‌కప్‌ అమెరికా క్వాలిఫయర్‌ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్‌ఏ అండర్‌-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్‌ 14) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. అండర్‌-19 క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. 

2002లో ఆస్ట్రేలియా అండర్‌-19 టీమ్‌.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ.. ఆసీస్‌ రికార్డును బ్రేక్‌ చేసి, అండర్‌-19 వన్డే ఫార్మాట్‌లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. 

ఓవరాల్‌గా లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా యూఎస్‌ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు టీమ్‌ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది.

వన్డే ఫార్మాట్‌లో అతి భారీ విజయం..
యూఎస్‌ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్‌ ఆరిన్‌ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్‌-19 క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్‌ పేరిట ఉండింది.

2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా (లిస్ట్‌-ఏ క్రికెట్‌) చూసినా యూఎస్‌ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్‌ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్‌పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భవ్య మెహతా (136), రిషి రమేశ్‌ (100) సెంచరీలతో.. ప్రణవ్‌ చట్టిపలాయమ్‌ (61), అర్జున్‌ మహేశ్‌ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్‌ఏ టీమ్‌ రికార్డు స్కోర్‌ చేసింది. యూఎస్‌ఏ టీమ్‌లో అమోఘ్‌ ఆరేపల్లి (48), ఉత్కర్ష్‌ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్‌ సతీశ్‌ (2), పార్థ్‌ పటేల్‌ (1), ఆర్యన్‌ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో (18) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు