వైరల్‌: బోల్ట్‌ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు

21 Jun, 2021 12:45 IST|Sakshi

జమైకా: చిరుత వేగంతో పరుగెత్తే ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్‌ బోల్ట్‌(34) మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన జీవిత భాగస్వామి బెన్నెట్‌ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఫాదర్స్ డే రోజున ఫ్యామిలీ ఫోటోతో ఉసేన్‌ బోల్ట్‌ సోషల్ మీడియాలో ఆదివారం పంచుకున్నారు. అయితే, బోల్ట్‌ పిల్లల పేర్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారి పేర్లు వరసగా ఒలింపియా లైటనింగ్‌ బోల్ట్‌, సెయింట్‌ లియో బోల్ట్‌, థండర్‌ బోల్ట్‌ కాగా.. ఒలింపియా లైటనింగ్‌ బోల్ట్‌ 2020 మేలో జన్మించింది. ఇక కవలల ఫొటో మాత్రమే పంచుకున్న బోల్ట్‌ వారు ఎప్పుడు జన్మించింది మాత్రం వెల్లడించలేదు.  

బోల్ట్‌ పిల్లల పేర్లపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘లైటనింగ్‌ (మెరుపు), థండర్‌ (ఉరుము)? ఇక ఇక్కడ తుపానే’’ అంటూ కామెంట్‌ చేశారు. ‘‘ఈ అందమైన కుటుంబానికి ఇక ఆనందం తప్ప మరేమీ ఉండదు.’’ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. బోల్ట్ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అభిమానుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా, బోల్ట్‌ జీవిత భాగస్వామి బెన్నెట్‌ స్పందిస్తూ.. ‘‘ ఈ కుటుంబానికి ఉస్సేన్ బోల్ట్ ఓ పెద్ద బలం.. పిల్లలకు ఓ గొప్ప తండ్రి.. ఎప్పటికీ ప్రేమతో  ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు.’’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2008, 2012, 2016 లో జరిగిన ఒలింపిక్స్‌లో  ఉసేన్‌ బోల్ట్‌  ఎనిమిది బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో  100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రెండేసి పతకాలు గెలిచిన ఏకైక అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌. 


చదవండి: Wrestler Khali: రెజర్ల్‌ కాళి ఇంట విషాదం

మరిన్ని వార్తలు