హోం క్వారంటైన్‌లో ఉన్న బోల్ట్‌

25 Aug, 2020 08:29 IST|Sakshi

కింగ్‌స్టన్‌: ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కోవిడ్‌ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘గుడ్‌ మార్నింగ్‌.. నాకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది. నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అందుకే హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నాను. ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్‌ ఏంటనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకోవాలిని భావిస్తున్నాను. నా ప్రజలు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు బోల్ట్‌. (భౌతిక దూరం: నాడు రియల్.. నేడు వైరల్‌)

ఇటీవల కొద్ది రోజుల క్రితమే అనగా ఆగస్టు 21న ఉసేన్‌ బోల్ట్‌ తన 34వ పుట్టిన రోజును ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ఇందులో ప్రముఖులతో పాటు చాలా మంది పాలుపంచుకున్నారు. అయితే ఈ పార్టీకి హాజరయిన వారు ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. భౌతిక దూరం అనే మాటేలేదు. విచ్చలవిడిగా ప్రవర్తించారని సమాచారం. అయితే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ కరోనా బారినపడటంతో ఆ పార్టీలో పాల్గొన్నవారందరూ ఆందోళనకు గురవుతున్నారు. వారిలో కొందరు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆగస్టు 21 న జరిగిన పుట్టినరోజు పార్టీకి మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్, బేయర్ లెవెర్కుసేన్ అటాకర్ లియోన్ బెయిలీ, క్రికెట్ లెజెండ్ క్రిస్ గేల్ హాజరైనట్లు భావిస్తున్నారు. జూన్‌లో టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఈ జాబితాలో చేరిన ప్రముఖ క్రీడాకారుడు బోల్ట్‌. 

మరిన్ని వార్తలు