కోహ్లి డకౌట్‌; ఉత్తరాఖండ్‌ పోలీస్‌ వార్నింగ్‌

13 Mar, 2021 09:48 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ 3వ వేసిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లిన విరాట్ కోహ్లీ  మిడాఫ్ దిశగా ఫీల్డర్ క్రిస్ జోర్దాన్ తలమీదుగా బౌండరీ కొట్టేందుకు ట్రై చేశాడు. కానీ అనూహ్యంగా బంతి బౌన్స్ కావడంతో.. కోహ్లి ఆశించిన విధంగా షాట​ కనెక్ట్ కాలేదు. దాంతో బంతి నేరుగా వెళ్లి  క్రిస్ జోర్దాన్ చేతుల్లో పడింది. దీంతో కోహ్లి ఏమి చేయలేక నిరాశగా వెనుదిరిగాడు.

అయితే కోహ్లి డకౌట్‌ను షేర్‌ చేస్తూ ఉత్తరాఖండ్‌ పోలీస్‌ విభాగం తమ ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ''హెల్మెట్‌ పెట్టుకోవడం ఒకటే కాదు.. బాధ్యతాయుతంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవు. ఒకవేళ అలాకాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారంటేకోహ్లి మాదిరే జీవితంలోనూ డకౌట్‌ అవుతారు ''అంటూ ట్వీట్‌ చేశారు. అయితే కోహ్లిని కించపరచడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఇలా చేశామని ఉత్తరాఖండ్‌ పోలీస్‌ విభాగం తెలిపింది. కాగా ఇంతకముందు పాకిస్థాన్‌పై 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా చేసిన నోబాల్ తప్పిదాన్ని జైపూర్ ట్రాఫిక్ పోలీసులు అప్పట్లో బ్యానర్లుగా వేయించి  సిగ్నల్స్ వద్ద వాహనదారులకి అవగాహన కల్పించారు. భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అవగాహన కోసం పోలీసులు ఇలాంటివి వినియోగిస్తున్నారు.

మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్‌ అయ్యర్‌ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జేసన్‌ రాయ్‌ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీసినందుకుగాను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) ఇదే వేదికలో జరగనుంది.
చదవండి:
సుందర్‌, బెయిర్‌ స్టో గొడవ.. అంపైర్‌ జోక్యం

కోహ్లి కథ ముగిసినట్టేనా..!

>
మరిన్ని వార్తలు