Sakshi Malik: ఐదేళ్ల తర్వాత పసిడి పతకంతో మెరిసింది!

4 Jun, 2022 08:27 IST|Sakshi

ఐదేళ్ల తర్వాత సాక్షి ‘పసిడి’ పట్టు

అల్మాటీ (కజకిస్తాన్‌): భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ సాక్షి మలిక్‌ ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బంగారంతో మురిసింది. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్‌ సిరీస్‌ ఈవెంట్‌లో ఆమె 62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.

ఇదే టోర్నీలో  భారత రెజ్లర్లు మాన్సి అహ్లావత్‌ (57 కేజీలు), దివ్య కక్రాన్‌ (68 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి 7–4తో ఇరినా కుజ్నెత్సొవ (కజకిస్తాన్‌)ను ఓడించింది.

చివరిసారిగా సాక్షి 2017 కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో బంగారం గెలిచింది. తర్వాత రెండు ఆసియా చాంపియన్‌ షిప్‌ (2020, 2022)లలో కాంస్యాలతోనే సరిపెట్టుకుంది. 57 కేజీల ఫైనల్లో మాన్సి 3–0తో ఎమ్మా టిసినా (కజకిస్తాన్‌)పై గెలుపొందింది. నలుగురు రెజ్లర్లు మాత్రమే తలపడిన 68 కేజీల కేటగిరీలో దివ్య రెండు బౌట్లలో అలవోక విజయాలు సాధించింది.

కానీ ఆఖరి బౌట్‌లో 10–14తో బొలొర్తుంగలగ్‌ జోరిట్‌ (మంగోలియా) చేతిలో ఓడింది. అయితే జోరిట్‌ కూడా రెండు బౌట్‌లలో గెలుపొందడంతో ఆమె, దివ్య సమఉజ్జీలుగా నిలిచారు. ఓవరాల్‌గా ఎక్కువ పాయింట్లు గెలిచిన దివ్యనే విజేతగా ప్రకటించారు.

చదవండి: మన అమ్మాయిలు భేష్‌: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం

మరిన్ని వార్తలు