టోక్యో ఒలింపియన్లకు వ్యాక్సిన్‌! 

17 Nov, 2020 09:29 IST|Sakshi

టోక్యో: కరోనా వైరస్‌ నేపథ్యంలో జపాన్‌ వాసుల ఆరోగ్య పరిరక్షణ కోసం టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ విశ్వక్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో పాటు ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చే అభిమానులకు వ్యాక్సిన్‌ తప్పనిసరి చేస్తున్నట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ సోమవారం ప్రకటించారు.

జపాన్‌ ప్రధాని యోషిహిడో సుగాతో భేటీ అనంతరం థామస్‌ బాచ్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘జపాన్‌ వాసుల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకున్నాం. క్రీడల నిర్వహణ నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే క్రీడాకారులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకునేలా ఐఓసీ చర్యలు తీసుకుంటుంది. అభిమానులకు కూడా దీన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఈ చర్యతో సురక్షిత వాతావరణంలో క్రీడలు జరగడంతో పాటు అభిమానులు కూడా ఎలాంటి భయం లేకుండా ఒలింపిక్స్‌ను ఆస్వాదిస్తారు’ అని బాచ్‌ వివరించారు. కరోనాతో వాయిదా పడిన ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జూలై 23 నుంచి జరుగనున్నాయి.    

మరిన్ని వార్తలు