బొటాస్‌కు పోల్‌ పొజిషన్‌

11 Oct, 2020 06:10 IST|Sakshi

నూర్‌బర్గ్‌ (జర్మనీ): మెర్సిడెస్‌ డ్రైవర్లు మరోసారి సత్తా చాటారు. వరుసగా 11వ రేసులోనూ ‘పోల్‌ పొజిషన్‌’ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) ఐఫెల్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో వాల్తెరి బొటాస్‌... అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 25.269 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్‌ పొజిషన్‌’ను దక్కించుకున్నాడు. తాజా సీజన్‌లో బొటాస్‌కు ఇది మూడో ‘పోల్‌’ కావడం విశేషం. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు.

మరో వైపు ఎఫ్‌1 దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌ ప్రి విజయాల (91 టైటిల్స్‌) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న లూయిస్‌ హామిల్టన్‌... ల్యాప్‌ను 0.256 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో నిలిచాడు. అనారోగ్యంతో రేసిం గ్‌ పాయింట్‌ డ్రైవర్‌ లాన్స్‌ స్ట్రోల్‌ ఐఫెల్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌తో పాటు ప్రధాన రేసుకు కూడా దూరమయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని నికో హల్కెన్‌బర్గ్‌ (జర్మనీ)తో రేసింగ్‌ పాయింట్‌ టీమ్‌ భర్తీ చేసింది. క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హల్కెన్‌బర్గ్‌ 20వ స్థానంలో నిలిచి రేసును అందరికంటే చివరగా ఆరంభించనున్నాడు. సీజన్‌ ఆరంభంలో హల్కెన్‌బర్గ్‌ రేసింగ్‌ పాయింట్‌ తరఫున పాల్గొన్నాడు.

మరిన్ని వార్తలు