ముందుంది మరింత మంచికాలం!

12 Mar, 2022 04:31 IST|Sakshi

ఐఎస్‌ఎల్‌ వేగంగా ఎదుగుతోంది

హైదరాబాద్‌ ఎఫ్‌సీ యజమాని వరుణ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ) యజమాని వరుణ్‌ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో నిలకడైన ప్రదర్శనతో హెచ్‌ఎఫ్‌సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్‌గా ఐఎస్‌ఎల్‌ కూడా ఒక బలమైన బ్రాండ్‌గా మారిందని విశ్లేషించారు. లీగ్‌లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్‌ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...

హైదరాబాద్‌ ఎఫ్‌సీ ప్రదర్శనపై...
చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్‌. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం.   

హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై...
స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్‌లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్‌కే వాస్తే’గా టీమ్‌లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్‌ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్‌కీపర్‌గా అతను మా రిజర్వ్‌ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్‌ఎల్‌ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

రిటైరైన విదేశీయులతో ఆడటంపై...
అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్‌ఎల్‌ సీజన్‌. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు.  పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్‌కు లీగ్‌ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్‌ఎల్‌ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్‌ నుంచి లీగ్‌ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్‌ఎల్‌ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు.

మరిన్ని వార్తలు