ఆటగాళ్ల రాతను మార్చిన కరోనా దెబ్బ

17 Nov, 2020 05:00 IST|Sakshi
డెలివరీ బాయ్‌గా పాల్‌ ఆడ్రియాన్‌ వాన్‌ మీకెరన్‌

కరోనా కాలంలో ఆటగాళ్ల కష్టాలు

కుటుంబ పోషణకు ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఉద్యోగం

ఒలింపిక్‌ చాంపియన్‌... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్‌ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్‌ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం.   

లాడ్జ్‌ (పోలాండ్‌): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్‌ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్‌ తర్వాత 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్‌ క్రీడాంశంలో రూబెన్‌ లిమార్డో గాస్కన్‌ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్‌ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు.


ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా రూబెన్‌ లిమార్డో; ‘లండన్‌’ స్వర్ణంతో...

రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్‌ దేశం పోలాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్‌షిప్‌ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది.

ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్‌ ఈట్స్‌’ డెలివరీ బాయ్‌ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్‌ ముగించుకున్న అనంతరం తన సైకిల్‌పై ఫుడ్‌ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్‌గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్‌–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్‌ చాంపియన్‌ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు.

మరో ఒలింపిక్‌ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్‌ డాలర్‌ విలువ సుమారు 10 వేల వెనిజులన్‌ బొలీవర్స్‌కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది.  

అంతర్జాతీయ క్రికెటర్‌ కూడా...
నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల పాల్‌ ఆడ్రియాన్‌ వాన్‌ మీకెరన్‌ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్‌ క్రికెట్‌ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్‌ బౌలర్‌ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టి20 వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్‌ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్‌ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్‌ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు.

అక్టోబర్‌–నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్‌ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్‌ మీకెరన్‌ కూడా ‘ఉబెర్‌ ఈట్స్‌’ డెలివరీ బాయ్‌గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్‌ క్రికెట్‌ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్‌ ఈట్స్‌ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్‌ ట్వీట్‌ చేశాడు.  

మరిన్ని వార్తలు